Kuldeep Singh Sengar: సెంగార్ జైలు శిక్ష సస్పెన్షన్
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:17 AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ముద్దాయిగా ఉన్న బీజేపీ నాయకుడు కులదీప్ సింగ్ సెంగార్‌కు మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఊరట కలిగించింది..
పలు షరతులతో బెయిల్ మంజూరు
ఉన్నావ్ రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 23: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ముద్దాయిగా ఉన్న బీజేపీ నాయకుడు కులదీప్ సింగ్ సెంగార్‌కు మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఊరట కలిగించింది. ఆయన అనుభవిస్తున్న జైలు శిక్షను సస్పెండ్ చేసింది. పలు ఆంక్షలు విధించి బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్‌ల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన ఘటనలో ఆయనపై కేసు నమోదయింది. ఈ క్రమంలోనే బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించడంతో సెంగార్‌పై మరో కేసు పెట్టారు. బాధితులను బెదిరిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు 2019లో ఈ కేసు విచారణను ఉన్నావ్ నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. అత్యాచారం కేసులో సెంగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2019లో ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. దానిని హైకోర్టు ప్రస్తుతం సస్పెండ్ చేసింది. ఈ తీర్పుపై సంతృప్తి చెందలేదని బాధితురాలు తెలిపారు. ‘నా తండ్రిని హత్య చేశారు. నాపై అత్యాచారం చేశారు. కొన్ని ఏళ్ల పాటు జైలులో ఉంచిన తరువాత నిందితుడిని విడుదల చేస్తున్నారు. ఇదేమి న్యాయం?’ అని ఆమె వాపోయారు. బాధితురాలి సోదరి కూడా ఇదే భయాలను వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని, భద్రత కోసం తమనే జైలుకు పంపించాలని కోరారు.