Delhi Court: హోటళ్లు తమ అతిథుల గోప్యతను కాపాడాలి
ABN , Publish Date - May 25 , 2025 | 04:15 AM
వివాహేతర సంబంధం కేసులో హోటల్ సీసీటీవీ ఫుటేజీ కోసం చేసిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న జంటకు గోప్యతా హక్కు ఉందని, కోర్టులు దర్యాప్తు సంస్థలు కావని న్యాయమూర్తి పేర్కొన్నారు.
వివాహేతర సంబంధం కేసులో సీసీ ఫుటేజీ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ, మే 24: ఒక వివాహేతర సంబంధం కేసులో హోటల్ సీసీటీవీ ఫుటేజీ కోసం చేసిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. హోటల్లో ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జంటకు గోప్యతా హక్కు ఉందని నొక్కి చెప్పింది. ఈ మేరకు ఇద్దరు ఆర్మీ మేజర్ అధికారుల కేసులో తీర్పు వెలువరించింది. తన భార్య మరో ఆర్మీ మేజర్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉందని ఆరోపిస్తూ, ఆ ఇద్దరు హోటల్ గదిలో ఉన్నప్పటి సీసీటీవీ ఫుటేజీని ఇవ్వాలంటూ సైన్యంలోని ఓ మేజర్, పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తమ అతిథుల గోప్యతను హోటళ్లు కాపాడాలని సివిల్ జడ్జి జస్టిస్ వైభవ్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జంటకు హోటల్లో ‘ప్రైవసీ హక్కు’ ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ఇలాంటి ప్రైవేటు సమాచారం సదరు వ్యక్తుల అనుమతి లేకుండా విడుదల చేయడం వారి గోప్యత, సహజ న్యాయ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. వారి ప్రతిష్ఠకు భంగం కూడా’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రైవేటు వివాదాలకు సంబంధించి న్యాయస్థానాలు దర్యాప్తు సంస్థలు కావు అని, అంతర్గత విచారణలో సాక్షాలను సేకరించే ఆధారంగానూ కోర్టులను భావించొద్దని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అడల్టరీపై 2018లో సుప్రీంకోర్టు వెలువరించిన కేసును ఉత్తర్వుల్లో కోర్టు ఉటంకించింది. ఒక వ్యక్తి, మరొక వ్యక్తి భార్య ప్రేమను ‘దొంగిలించవచ్చు’ అనే భావనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని గుర్తుచేశారు. ఫిర్యాదుదారుడు ఆర్మీ చట్టం (1950), అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం పరిష్కారం పొందాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..