National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో..సోనియా, రాహుల్‌కు ఊరట
ABN , Publish Date - Dec 17 , 2025 | 03:52 AM
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఢిల్లీలోని......
ఈడీ చార్జిషీట్‌ను కొట్టేసిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ కేసు ఒక ప్రైవేట్ ఫిర్యాదుపై ఆధారపడిందని, నేరారోపణపై ఎక్కడా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని గుర్తుచేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) క్రింద అది చెల్లదని న్యాయమూర్తి విశాల్ గోగ్నే స్పష్టంచేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా, రాహుల్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడా, సునీల్ భండారీతోపాటు యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్కండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థలపై చేసిన ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. సీఆర్‌పీసీ సెక్షన్ 200 క్రింద ప్రైవేట్ వ్యక్తి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ప్రాసిక్యూషన్ ఫిర్యాదు చేయడాన్ని అనుమతించలేమని తేల్చి చెప్పింది. ఈడీ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరపడం ఈ దశలో సాధ్యం కాదని తెలిపింది. అంతేకాక ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం ఈ అంశంపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినందున ఈడీ కేసుపై విచారణ నిర్వహించలేమని పేర్కొంది. అయితే, ఢిల్లీ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది. కాగా, ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదు చేసినా దర్యాప్తు జరిపే అధికారం ఈడీకి ఉందని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను ముద్రిస్తున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థ ఆస్తులను గాంధీ కుటుంబం, వారి సన్నిహితులు కాజేశారని 2012లో అప్పటి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. కోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తంచేసింది. సత్యమే గెలిచింది (సత్యమేవ జయతే) అని పేర్కొంది. రాజకీయ కక్ష సాధింపుతో ఈడీ కేసు దాఖలు చేసిందని మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించింది. ఎఫ్‌ఐఆర్ లేకుండానే దశాబ్ద కాలంగా మోదీ ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరించిందని మండిపడింది.