Delhi CM Rekha Gupta Attacked: ఢిల్లీ సీఎంపై దాడి
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:36 AM
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రతివారం నిర్వహించే జన్ సున్‌వాయి ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఒక వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. .
రేఖాగుప్తా చెంపపై కొట్టి, జుట్టు పట్టి లాగిన గుజరాత్ వాసి రాజేశ్ సకారియా
ముఖ్యమంత్రి ప్రజాదర్బార్‌లో ఘటన
రేఖ చెయ్యి, భుజం, తలకు గాయాలు
సకారియాపై హత్యాయత్నం కేసు నమోదు
దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు
వీధి కుక్కలపై సుప్రీం తీర్పు మీద నిరసన తెలిపేందుకే ఢిల్లీ వెళ్లాడు: సకారియా తల్లి
న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రతివారం నిర్వహించే ‘జన్ సున్‌వాయి’ (ప్రజాదర్బార్) కార్యక్రమంలో ఒక వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం సివిల్ లైన్స్‌లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరు వచ్చి ఆమెకు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. 8.15 గంటలకు ఓ వ్యక్తి తన వద్దనున్న కాగితాలను రేఖా గుప్తాకు అందించారు. వెంటనే అరుస్తూ ఆమెపై దాడి చేశాడు. చెయ్యి పట్టుకొని లాగి చెంపపై కొట్టాడు. తర్వాత జుట్టు పట్టుకొని లాగాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అదపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్ భాయ్ ఖిమ్జి భాయ్ సకారియా (41)గా గుర్తించారు. తన బంధువు జైల్లో ఉన్నారని, విడిపించాంటూ పిటిషన్ ఇచ్చేందుకు వచ్చానని సకారియా చెప్పినట్టు తెలిసింది. సీఎంకు ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కాగా, ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి అని సీఎం కార్యాలయం(సీఎంవో) ఓ ప్రకటనలో తెలిపింది. ఆమెను చంపే కుట్రగా అభివర్ణించింది. నిందితుడిపై హత్యాయత్నం సహా పలు అభియోగాలతో ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఘటనను ఆప్ నేత అర్వింద్ కేజ్రీవాల్ ఖండించారు. కాగా, వీధి కుక్కలపై సుప్రీం తీర్పుపై నిరసన తెలిపేందుకు తన కొడుకు సకారియా ఢిల్లీ వెళ్లినట్లు అతడి తల్లి భానుబెన్ రాజ్‌కోట్‌లో విలేకరులకు తెలిపారు. సకారియాకు కుక్కలంటే ఎంతో ఇష్టమన్నారు.