Delhi blast probe: ఢిల్లీ పేలుడు నిందితుడి ఇల్లు పేల్చివేత
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:21 AM
ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై భద్రతా దళాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని శుక్రవారం తెల్లవారు జామున పేల్చివేశాయి...
న్యూఢిల్లీ, నవంబరు 14: ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై భద్రతా దళాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని శుక్రవారం తెల్లవారు జామున పేల్చివేశాయి. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా కొలీ గ్రామంలోని నివాసాన్ని కూల్చేసినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడుకు కారణమైన హ్యుందాయ్ ఐ20 కారును ఉమర్ నబీనే నడిపినట్లు పోలీసులు గుర్తించారు. కారులో సేకరించిన డీఎన్‌ఏ నమూనాలు.. నబీ తల్లి డీఎన్‌ఏతో సరిపోలినట్లు వెల్లడించారు. ఈ కేసులో కొత్తగా అరెస్టయిన ఐదుగురిలో ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు వైద్యులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. వీరిలో యూపీలో పనిచేస్తున్న జమ్మూ కశ్మీర్‌కు చెందిన కార్డియాలజిస్టు మహమ్మద్ ఆరిఫ్ మిర్ (32), గైనకాలజిస్టు ఫారుక్ ఉన్నారు. ఇటు మరో ఇద్దరు అనుమానితులతో కలిసి తుర్కియేను సందర్శించిన వైద్యుడి కోసం దర్యాప్తు అధికారులు గాలింపు మొదలుపెట్టారు. ఇప్పటివరకు అరెస్టయిన వారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ కోసం ఢిల్లీకి తరలించారు. కాగా, ఢిల్లీ పేలుళ్ల వెనకున్న జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధమున్న నలుగురు వైద్యులైన ముజఫర్ అహ్మద్, అదిల్ అహ్మద్ రాథర్, ముజామిల్ షకీల్, షాహీన్ షాహిద్‌ల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ప్రకటించింది.