Share News

Farmer to Sell Kidney: అప్పు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్న రైతు

ABN , Publish Date - Dec 17 , 2025 | 03:46 AM

తీసుకున్న అప్పును తీర్చడానికి ఓ రైతు తన కిడ్నీని అమ్ముకున్న ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది....

Farmer to Sell Kidney: అప్పు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్న రైతు

  • మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో ఘటన

చంద్రాపూర్‌, డిసెంబరు 16: తీసుకున్న అప్పును తీర్చడానికి ఓ రైతు తన కిడ్నీని అమ్ముకున్న ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ రైతు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.లక్ష అప్పు తీసుకోగా రోజుకు రూ.10 వేల వడ్డీని వసూలు చేయడంతో అది రూ.75 లక్షలకు చేరుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. రోషన్‌ సదాశివ్‌ కుడే అనే రైతు వ్యవసాయంలో వరుస నష్టాలు రావడంతో పాల వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పలువురు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.లక్ష రుణం తీసుకున్నాడు. దురదృష్టవశాత్తు ఆయన తన డెయిరీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందే తాను కొనుగోలు చేసిన ఆవులు మృత్యువాత పడ్డాయి. దీనికి తోడు పంటల వల్ల నష్టం రావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తీసుకున్న అప్పును తీర్చాలంటూ వడ్డీ వ్యాపారులు కుడేతోపాటు ఆయన కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టారు. దీంతో అప్పును తీర్చడానికి తన భూమి, ట్రాక్టర్‌తో పాటు గృహోపకరణాలను విక్రయించాడు. అయినప్పటికీ తీసుకున్న అప్పు తీరలేదు. ఈ నేపథ్యంలో కిడ్నీని విక్రయించి అప్పును తీర్చాలంటూ ఓ వడ్డీ వ్యాపారి కుడేకు సలహాఇచ్చాడు. అందుకు సిద్ధపడిన కుడే.. ఓ ఏజెంట్‌ ద్వారా కోల్‌కతాకు వెళ్లాడు. అక్కడ పరీక్షల తర్వాత కాంబోడియాకు వెళ్లి అక్కడ కిడ్నీని రూ.8లక్షలకు విక్రయించాడు. ఈ పరిణామాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదని కుడే చెప్పారు. తనకు న్యాయం చేయకుంటే తన కుటుంబంతో సహా ముంబైలోని సచివాలయం ముందు ఆత్మాహుతి చేసుకుంటామన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 03:46 AM