Former CJI Justice B.R. Gavai: సీజేఐ కుమారుడికి.. కార్మికుడి కొడుక్కి ఒకే నిబంధనలా?
ABN , Publish Date - Dec 08 , 2025 | 03:36 AM
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీల)కూ క్రీమీలేయర్ వర్తింపజేయాలని తీర్పునిచ్చినందుకు తీవ్ర విమర్శల పాలయ్యానని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి.....
రాజ్యాంగం గురించి కనీస అవగాహనలేని వారే నాపై విమర్శలు గుప్పించారు: జస్టిస్ గవాయ్
ముంబై, డిసెంబరు 7: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీల)కూ క్రీమీలేయర్ వర్తింపజేయాలని తీర్పునిచ్చినందుకు తీవ్ర విమర్శల పాలయ్యానని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. రాజ్యాంగ నిబంధనల గురించి కనీస అవగాహన లేని వారే అజ్ఞానంతో తనపై ఆరోపణలు గుప్పించారని చెప్పారు. సీజేఐ కుమారుడికి.. కార్మికుడి కొడుక్కి ఒకే ప్రమాణాలు వర్తింపజేయవచ్చా అని ప్రశ్నించారు. ఎస్సీ కోటాలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న (క్రీమీలేయర్) వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి దూరంగా ఉంచాలంటూ.. గతేడాది ఆగస్టులో విస్తృత ధర్మాసనంలో భాగమైన జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. అయితే ఆ తీర్పుతో తన సొంత సామాజిక వర్గం నుంచే తీవ్ర విమర్శలు ఎదురయ్యాయని చెప్పారు. ఆనాడు సిటింగ్ జడ్జిగా ఉన్నానని.. అందుకే ఏ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఏదేమైనా న్యాయమూర్తులు తమ తీర్పుల గురించి చర్చించకూడదని.. అయితే తాను రిటైరయ్యాను కాబట్టి మాట్లాడుతున్నానని వివరించారు. ‘నేను రిజర్వేషన్ ద్వారానే సీజేఐ దాకా ఎదిగి.. ఇప్పుడు క్రీమీలేయర్ వర్తింపజేయాలంటూ మాట్లాడానని ఆరోపణలు గుప్పించారు. రాజ్యాంగ నిబంధనలు తెలియని వారే ఇలా మాట్లాడతారు. హైకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవులకు అసలు రిజర్వేషన్లు వర్తించవనేది కూడా వారికి తెలియదు. ఈ పదవుల కోసం పోటీ పడాల్సి వస్తుంది. సాధారణంగా సీనియారిటీని బట్టి 65 ఏళ్ల లోపున్న వారికే అవకాశం దక్కుతుంది. క్రీమీలేయర్‌పై నాకంటే ముందు 1975లో జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కూడా మాట్లాడారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టాన్ని, న్యాయమూర్తుల మునుపటి తీర్పులను బట్టే మాట్లాడతాము. నేను చెప్పింది సరైందో.. కాదో దేశ ప్రజలే చెప్పాలని కోరుతున్నా..’ అని వ్యాఖ్యానించారు.