MP Kalyan Banerjee Bank Account: టీఎంసీ ఎంపీ ఖాతా నుంచి రూ.57 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:16 AM
తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.57 లక్షలను మాయం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో..
కోల్‌కతా, నవంబరు 8: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.57 లక్షలను మాయం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోల్‌కతాలోని ఎస్‌బీఐ విధానసభ బ్రాంచీలో ఖాతాను తెరిచారు. ఎమ్మెల్యే జీతం ఆ ఖాతాలో జమ అయ్యేది. ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఆ ఖాతా ఉపయోగంలో లేదు. దీంతో ఆ ఖాతాపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు కేవైసీ ఫోర్జరీ చేసి, ఖాతాను మళ్లీ ఉపయోగంలోకి తెచ్చారు. అందులోని మొత్తాన్ని ఇతర ఖాతాల్లోకి బదిలీ చేయడంతో పాటు నగల కొనుగోళ్లకు ఉపయోగించారు. నేరగాళ్లు నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డులను ఉపయోగించి తన ఖాతాను పునరుద్ధరించారని, ఒక మొబైల్ నెంబర్‌ను జతచేసి దాని ద్వారా ఓటీపీలు, లావాదేవీలపై నియంత్రణ పొందారని కల్యాణ్ బెనర్జీ వెల్లడించారు. తమ బ్యాంకు అంతర్గత లోపం కారణంగానే ఈ మోసం జరిగిందని పేర్కొంటూ ఎస్‌బీఐ ఆ మొత్తాన్ని తిరిగి తన పార్లమెంట్ ఖాతాలో జమ చేసిందన్నారు.