Cyber Fraudsters Forge Nirmala Sitharamans Signature: నిర్మల సంతకం ఫోర్జరీ చేసి 99 లక్షలు చోరీ!
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:09 AM
సైబర్ నేరగాళ్లు మరీ బరి తెగిస్తున్నారు. ఏకంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ వృద్ధమహిళ నుంచి.....
ఫుణెలో సైబర్ నేరగాళ్ల దోపిడీ
ముంబై, నవంబరు 12: సైబర్ నేరగాళ్లు మరీ బరి తెగిస్తున్నారు. ఏకంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ వృద్ధమహిళ నుంచి రూ.99 లక్షలు కొట్టేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. ఎల్‌ఐసీలో పని చేసి పదవీ విరమణ పొందిన 62 ఏళ్ల వయసున్న ఓ మహిళకు అక్టోబరు నెల చివరి వారంలో ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ అనే ఓ ప్రభుత్వ సంస్థకు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకొని.. పలు తప్పుడు లావాదేవీలు, మనీల్యాండరింగ్ వ్యవహారాల్లో మీ ఫోన్ నెంబరును ఉపయోగించారని ఆ మహిళకు తెలిపాడు. ఆ తర్వాత మరొకడికి కాల్ కనెక్ట్ చేశాడు. ఆ వ్యక్తి.. తాను పోలీసు అధికారినని, మీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తున్నామని, మీ మీద అరెస్టు వారెంటు జారీ అయ్యిందని భయపెట్టాడు. ఈ మేరకు ప్రభుత్వ లోగో, నిర్మలా సీతారామన్ సంతకంతో కూడిన ఓ పత్రాన్ని ఫోన్‌లోనే చూపించాడు. వయసు దృష్ట్యా మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని, ఖాతాల్లోని సొమ్మును పరిశీలించాల్సి ఉంది కాబట్టి, సొమ్మును ఆర్బీఐ అకౌంట్లకు బదిలీ చేయాలని ఆదేశించాడు. బెదిరిపోయిన ఆ వృద్ధ మహిళ పలు ఖాతాలకు రూ.99 లక్షలు బదిలీ చేశారు. ఈ మేరకు ఈడీ పేరిట ఓ తప్పుడు రశీదు కూడా ఆమెకు వాట్సాప్ చేశారు సదరు మోసగాళ్లు. ఆ తర్వాత వారికి ఆ మహిళ ఫోన్ చేయగా.. స్విచాఫ్ అని రావటంతో, మోసపోయానని గ్రహించి పోలీసుల కు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు