Customs Raids: దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లల్లో కస్టమ్స్ సోదాలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 02:41 AM
అత్యంత విలాసవంతమైన ఆ కార్లు దేశంలోకి ఎలా వచ్చాయి? ఎన్ని వచ్చాయి? ఎవరెవరి వద్ద ఉన్నాయి? అని తేల్చేందుకు ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’లో పేరుతో రంగంలోకి...
కేరళ వ్యాప్తంగా ఏకకాలంలో 30-35 చోట్ల నిర్వహణ
సెకండ్ హ్యాండ్ వాహనాల దిగుమతిపై దేశంలో నిషేధం
ఒక్క కేరళలోకే భూటాన్ నుంచి 120 నుంచి 150 లగ్జరీకార్లు
కేరళలో 36 కార్ల సీజ్.. ఆ యజమానులకు నోటీసులు
కోచి, సెప్టెంబరు 23: అత్యంత విలాసవంతమైన ఆ కార్లు దేశంలోకి ఎలా వచ్చాయి? ఎన్ని వచ్చాయి? ఎవరెవరి వద్ద ఉన్నాయి? అని తేల్చేందుకు ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’లో పేరుతో రంగంలోకి దిగిన అధికారులు దూకుడు పెంచారు. భూటాన్ మీదుగా అక్రమంగా వందకు మించి దిగుమతి అయిన అత్యంత విలాసవంతమైన ప్రీమియం వాహనాలను ఇప్పటికే ట్రాక్ చేసిన కస్టమ్స్ అధికారులు.. డొంక కేరళలో కదలడంతో అక్కడ వాలిపోయారు. అక్కడ మంగళవారం మలయాళం చిత్రపరిశ్రమకు చెందిన అగ్రశ్రేణి నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమార్ సహా మరికొందరు నటులు, పారిశ్రామికవేత్తలు, ఽమరికొందరు బడాబాబుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. సుమ్‌ఖోర్ అంటే.. భూటాన్‌లోని జాతీయ భాష అయిన జోంకాలో వాహనం అని అర్థం! అందుకే.. ఈ ఆపరేషన్‌కు సుమ్‌ఖోర్ అనే పేరు పెట్టారు. కొచ్చిలోని దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాలు సహా కేరళ వ్యాప్తంగా 30 నుంచి 35 చోట్ల సోదాలు జరిగాయి. తిరువనంతపురం, కొజికోడ్, మలప్పురం, కుట్టిప్పురం, త్రిస్సూర్‌ల్లో సోదాలు నిర్వహించారు. ఇతర దేశాల నుంచి భారత్‌కు సెకండ్ హ్యాండ్ వాహనాలను దిగుమతి చేసుకోవడంపై నిషేధం ఉందని కస్టమ్స్ అధికారులు స్పష్టం చేశారు. భూటాన్ నుంచి తీసుకొచ్చిన వాహనాల్లో ఒక్కటి కూడా భారత్‌లో తయారైంది లేదని అన్నారు. కొత్త వాహనాలనే తొలుత భూటాన్‌కు అక్రమంగా తీసుకెళ్లి అక్కడ నుంచి తిరిగి సెకండ్ హ్యాండ్ పేరుతో తీసుకొస్తున్నారని అభిప్రాయపడ్డారు. 10-15 సందర్భాల్లో అక్రమ దిగుమతులు జరిగినట్టు గుర్తించామని తెలిపారు. మోటారు వాహనాలకు సంబంధించిన పరివాహన్ వెబ్‌సైట్, కస్టమ్స్ వెబ్‌సైట్‌లోనూ ఫోర్జరీలు చేసి దిగుమతి చేసుకున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. అక్రమంగా దిగుమతి చేసుకున్న వాహనాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. యజమానులు తగిన పత్రాలను చూపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆపరేషన్ సుమ్‌ఖోర్‌లో భాగంగా ఇప్పటివరకు కస్టమ్స్ అధికారులు 36 హై ఎండ్ లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ఇందులో దుల్కర్‌వి రెండుకార్లు (డిఫెండర్, ప్రాడో) ఉన్నట్లుగా భావిస్తున్నారు. కాగా 36 కార్ల యజమానులందరికీ నోటీసులు జారీ చేశారు. భూటాన్ నుంచి ఒక్క కేరళ రాష్ట్రంలోకే 120 నుంచి 150 కార్లు అక్రమంగా దిగుమతి అయ్యాయని అధికారులు చెబుతున్నారు.