C P Radhakrishnan: కోయంబత్తూరు వాజ్‌పేయి సీపీఆర్
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:24 AM
భారత 15వ ఉపరాష్ట్రపతిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్(సీపీఆర్) ఎన్నికవడం పట్ల..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళనాడులో రథయాత్ర
చెన్నై, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): భారత 15వ ఉపరాష్ట్రపతిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్(సీపీఆర్) ఎన్నికవడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తిరుప్పూర్‌కు చెందిన వ్యాపార, వ్యవసాయ కుటుంబంలో సీకే పొన్నుస్వామి-కె.జానకి దంపతులకు 1957 అక్టోబరు 20వ తేదీన ఆయన జన్మించారు. సీపీఆర్‌కు భార్య సుమతి, ఇద్దరు పిల్లలున్నారు. తొలి నుంచి సౌమ్యుడిగా పేరున్న సీపీఆర్‌ను అందరూ ముద్దుగా ‘కోయంబత్తూర్ వాజ్‌పేయి’గా పిలుచుకుంటారు. తూత్తుకుడిలోని వీవోసీ కాలేజీలో బీబీఏ చదివిన రాధాకృష్ణన్.. టేబుల్ టెన్నిస్‌లో కాలేజీ చాంపియన్. చిన్నతనం నుంచే ఆయన ఆర్‌ఎ్‌సఎస్, భారతీయ జనసం్‌ఘలతో మమేకమయ్యారు. 1974లో జనసంఘ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. అనంతరం 1980లో బీజేపీలో చేరారు. 1998 ఫిబ్రవరిలో కోయంబత్తూరులో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 1.50 లక్షల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం మళ్లీ 1999లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అదే స్థానం నుంచి 55 వేల వేట్ల మెజారిటీతో గెలిచి సత్తా చాటారు. 2004లో సీపీఐ నేత కె.సుబ్బరాయన్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2014, 2019లలో కూడా ఆయన కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. 2004 నుంచి రెండేళ్లపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన సీపీఆర్.. దేశవ్యాప్తంగా నదులను అనుసంధానించాలని, అంటరానితనాన్ని నిర్మూలించాలని, ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని కోరుతూ 93 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేపట్టారు. తరువాత బీజేపీ జాతీయ కార్యవర్గంలోనూ పని చేశారు. 2016 నుంచి నాలుగేళ్లపాటు ఎంఎ్‌సఎంఈ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే కొబ్బరిపీచు బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరించారు.
నాలుగు రాష్ట్రాలకు గవర్నర్
సీపీఆర్‌కు పార్టీ పట్ల ఎనలేని విధేయత, భవిష్యత్ ప్రణాళికల వ్యూహరచన వంటి వాటిని గమనించిన ప్రధాని మోదీ.. ఆయనను గవర్నర్‌గా నియమించారు. అనతికాలంలోనే సీపీఆర్ నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించడం విశేషం. 2023 ఫిబ్రవరి 18వ తేదీన జార్ఖండ్ గవర్నర్‌గా పదవీప్రమాణం చేసిన సీపీఆర్.. తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఇన్‌చార్జ్ గవర్నర్‌గా కొంతకాలం అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2024 జూలై 27లో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. దక్షిణ భారత వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని నిర్ణయించిన ప్రధాని.. సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్‌డీఏ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
తమిళనాట నుంచి మూడో ఉపరాష్ట్రపతి
తమిళనాడు నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఉపరాష్ట్రపతి పదవిని అధిరోహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదట 1952 మే 13 నుంచి 1957 మే 13 వరకు ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఐదేళ్లు కూడా ఆయన ఆ పదవిలో కొనసాగారు. అనంతరం ఆయన రాష్ట్రపతిగానూ వ్యవహరించారు. ఆయన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్.వెంకట్రామన్ ఉపరాష్ట్రపతిగా (1984-1987) వ్యవహరించడంతో పాటు ఆ తరువాత రాష్ట్రపతి పదవిని కూడా అధిరోహించారు. నాలుగు దశాబ్దాల తరువాత మళ్లీ రాష్ట్రాన్ని ఉపరాష్ట్రపతి పదవి వరించింది. తమిళ ప్రాంతం నుంచి ఆ పదవికి ఎన్నికైన మూడో వ్యక్తిగా సీపీఆర్ రికార్డులకెక్కారు.