Allahabad High Court: మతమార్పిడి అక్రమమైతే పెళ్లి చెల్లదు
ABN , Publish Date - Sep 25 , 2025 | 03:50 AM
మతమార్పిడి చట్టవిరుద్ధమని తేలినప్పుడు దాని ఆధారంగా జరిగే వివాహం కూడా ఆటోమేటిక్‌గా రద్దవుతుందని అలహాబాద్ హైకోర్టు తీర్చు చెప్పింది...
అలహాబాద్ హైకోర్టు తీర్పు
ప్రయాగ్‌రాజ్, సెప్టెంబరు 24: మతమార్పిడి చట్టవిరుద్ధమని తేలినప్పుడు దాని ఆధారంగా జరిగే వివాహం కూడా ఆటోమేటిక్‌గా రద్దవుతుందని అలహాబాద్ హైకోర్టు తీర్చు చెప్పింది. చట్టం దృష్టిలో వారు వివాహితులు కారని తెలిపింది. ముస్లిం మతానికి చెందిన మహమ్మద్ బిన్ కాసీం అలియాస్ అక్బర్, హిందూ మతానికి చెందిన జైనాబ్ పర్వీన్ అలియాస్ చంద్రకాంతల వివాహం విషయంలో కోర్టు ఈ తీర్పునిచ్చింది. చంద్రకాంత మతం మారినట్టు దొంగ సర్టిఫికెట్లు సమర్పించారని ఆమె తల్లిదండ్రులు పిటిషన్ సమర్పించగా, తమ వివాహంలో ఇతరులు జోక్యం చేసుకోకూడదంటూ కాసీం వేసిన మరో పిటిషన్ వేశారు. ఈ రెండింటిపై న్యాయమూర్తి విచారణ జరిపారు. చంద్రకాంత ముస్లిం మతంలోకి మారినట్టు ఖాన్‌కారే ఆలియా అరిఫీయా సంస్థ ఫిబ్రవరి 22న సర్టిఫికెట్ ఇచ్చింది. దాన్ని ఆధారం చేసుకొని మే 26న ముస్లిం చట్టాల ప్రకారం వివాహం జరిపించినట్టు క్వాజీ ధ్రువపత్రం ఇచ్చారు. మతమార్పిడి జరిగినట్టు ఇచ్చిన సర్టిఫికెట్ నకిలీదని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ ఆరోపణ సరైనదేనని, తాము ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆ సంస్థ కార్యదర్శి తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వివాహం చెల్లదని ప్రకటించారు. అయితే వారు ప్రత్యేక వివాహం చట్టం కింద పెళ్లిని రిజిస్టర్ చేసుకోవచ్చని, దాని ప్రకారమయితే మత మార్పిడి సమస్య తలెత్తదని సూచించారు.