Share News

Cough Syrup: ఇద్దరు చిన్నారులను బలిగొన్న దగ్గు మందు!

ABN , Publish Date - Oct 02 , 2025 | 03:05 AM

దగ్గు మందు సిరప్‌ తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో 10 మంది పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారు. ఆ సిరప్‌ సురక్షితమేనని నిరూపించేందుకు తాగిన ఓ వైద్యుడూ అస్వస్థతకు...

Cough Syrup: ఇద్దరు చిన్నారులను బలిగొన్న దగ్గు మందు!

  • మరో 10 మంది పిల్లలకు అనారోగ్యం

  • ఆ మందు సురక్షితమేనంటూ తాగిన ఓ వైద్యుడికి అస్వస్థత.. రాజస్థాన్‌లో ఘటన

  • ఆ సిరప్‌ 22 బ్యాచ్‌లపై సర్కారు నిషేధం

జైపూర్‌, అక్టోబరు 1: దగ్గు మందు సిరప్‌ తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో 10 మంది పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారు. ఆ సిరప్‌ సురక్షితమేనని నిరూపించేందుకు తాగిన ఓ వైద్యుడూ అస్వస్థతకు గురై కొద్ది సేపు స్పృహ కోల్పోయారు. రాజస్థాన్‌లో గత రెండు వారాల్లో చోటు చేసుకున్న ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సికార్‌ జిల్లాకు చెందిన 5 ఏళ్ల నితీశ్‌ దగ్గుతో బాధపడుతుండగా సెప్టెంబరు 28న చిరానాలోని ప్రభుత్వాస్పత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు అతడికి సిర్‌పను ఇచ్చారు. రాత్రి అది తాగి పడుకున్న నితీశ్‌ ఉదయం లేవలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సెప్టెంబరు 22న మల్హాలో జ్యోతి అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు ప్రభుత్వాస్పత్రి నుంచి తెచ్చిన అదే దగ్గు సిర్‌పను తాగించింది. కాసేపటికే ఆ ముగ్గురూ స్పృహ కోల్పోగా.. ఇద్దరు వాంతులు చేసుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 2 ఏళ్ల సామ్రాట్‌ జాతవ్‌ పరిస్థితి విషమించడంతో మరణించాడు. అదే నెల 24న బయానాలోని ప్రభుత్వాస్పత్రిలో ఓ మూడేళ్ల చిన్నారికి డాక్టర్‌ తారాచంద్‌ యోగి ఆ సిర్‌పను ఇచ్చారు. అది తాగిన బాలుడు అస్వస్థతకు గురవ్వడంతో తల్లిదండ్రులు డాక్టర్‌ను నిలదీశారు. ఈ క్రమంలోనే ఆ సిరప్‌ సురక్షితమేనని నిరూపించేందుకు యోగి తాను తాగారు. ఆ తర్వాత కారులో బయలుదేరిన యోగి.. అందులోనే స్పృహ కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేసన్‌ సంస్థ సరఫరా చేసిన 22 బ్యాచ్‌ల దగ్గు మందు సిర్‌పలను నిషేధించి.. వాటి పంపిణీని నిలిపేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Oct 02 , 2025 | 03:05 AM