PM Modi: బలమైన ప్రజాస్వామ్యానికిరాజ్యాంగ బాధ్యతలే పునాది
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:15 AM
దేశంలో బలమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ బాధ్యతలే బలమైన పునాది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజలంతా రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని ఒక లేఖ రాశారు. ఒక బలహీన....
బాధ్యతల నుంచే హక్కులు వస్తాయన్న మహాత్మాగాంధీ మాటలు గుర్తుంచుకోవాలి
పౌరులంతా కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, నవంబరు 26: దేశంలో బలమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ బాధ్యతలే బలమైన పునాది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజలంతా రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని ఒక లేఖ రాశారు. ఒక బలహీన, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన తాను 24 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా ఉండగలగడం మన రాజ్యాంగం శక్తికి నిదర్శమన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఓటు హక్కును వినియోగించుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. బాధ్యతల నిర్వహణ నుంచే హక్కులు వస్తాయన్న మహాత్మా గాంధీ మాటలను మోదీ గుర్తు చేశారు. బాధ్యతలను నెరవేర్చడం దేశ సామాజిక, ఆర్థిక పురోగతికి అవసరమన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన బాబూ రాజేంద్ర ప్రసాద్, అంబేడ్కర్‌లతోపాటు స్వాతంత్య్ర పోరాటంలో ముందుండి నిలిచారంటూ మహాత్మా గాంధీ, బిర్సా ముండా, వల్లభ్‌భాయ్ పటేల్‌ల కృషిని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు తరాల జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. వికసిత భారత్ దిశగా దూసుకెళ్తున్న మన దేశంలో ప్రతి పౌరుడు తన బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. కొత్తగా 18 ఏళ్లు నిండి ఓటు హక్కు వచ్చిన వారి కోసం ఏటా నవంబర్ 26న పాఠశాలలు, కాలేజీలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాజ్యాంగం మన దేశానికి ప్రత్యేక గుర్తింపు అని, మనకు గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. వలసవాద మనస్తత్వాన్ని విడిచిపెట్టి జాతీయ వాద భావన వైపు మళ్లేందుకు దారిచూపూ మార్గనిర్దేశకం రాజ్యామని చెప్పారు. పాత పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ దేశం కూడా గొప్పగా మారలేదని.. వికసిత భారత్ లక్ష్యం దిశగా పౌరులంతా కలసి నడవాలని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో తెలుగు, మళయాలం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ భాషల్లో రాజ్యాంగ డిజిటల్ ప్రతులను రాష్ట్రపతి విడుదల చేశారు. మరోవైపు సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో జస్టిస్ సూర్యకాంత్‌తోపాటు భూటాన్, కెన్యా, మారిషన్, శ్రీలంక దేశాల సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను ప్రశంసించారు.
రాజ్యాంగ సూత్రాలను మోదీ, షా దెబ్బతీస్తున్నారు: కాంగ్రెస్
భారత రాజ్యాంగాన్ని బలహీనం చేసేందుకు బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భారత రాజ్యాంగ సూత్రాలను ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళిక ప్రచారం దెబ్బతీస్తున్నారని మండిపడింది. ప్రస్తుతం బీజేపీ రాజ్యాంగంపై చూపుతున్న ప్రేమ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న నాటకం మాత్రమేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అది పేదలను, బలహీన వర్గాలను రక్షించే కవచమని.. దానిపై బీజేపీ దాడిని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టుపెట్టారు. ఇక ప్రధాని మోదీ ఎన్నడూ పాటించని రాజ్యాంగ బాధ్యతలను ప్రజలకు ఉపదేశించడం ఏమిటని జైరామ్ రమేశ్ ఎద్దేవా చేశారు.
మత విద్వేషానికి పేరుపొందిన మీరా మాకు చెప్పేది?
మోదీ రామ మందిర ధ్వజారోహణను పాక్ తప్పుబట్టడంపై భారత విదేశాంగ శాఖ
అయోధ్య రామమందిర ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడాన్ని తప్పుబడుతూ పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. మత విద్వేషానికిపేరు పొందిన పాకిస్థాన్ ఈ విషయంలో మాట్లాడటం ఏమిటని నిలదీసింది. అయినా భారత అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటని మండిపడింది. ప్రధాని మోదీ అయోధ్య రామమందిరం ధ్వజారోహరణ చేయడాన్ని ప్రస్తావిస్తూ పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం.. భారత్‌లో మతపరమైన మైనారిటీలు ప్రమాదంలో పడుతున్నారని.. ముస్లిం వారసత్వ ప్రాంతాలకు హిందూ ఉగ్రవాదుల ముప్పు పెరుగుతోందని పేర్కొంది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మైనారిటీలపై వ్యవస్థాగత వివక్షకు పేరుపడిన దేశం పాకిస్థాన్. ముందు మీ దేశంలో మానవ హక్కుల అణచివేతపై, అంతర్గత సమస్యలపై దృష్టిపెట్టుకోవాలి’’ అని పాకిస్థాన్‌కు సూచించారు.