Congress: నిష్పక్షపాతంగా వ్యవహరించండి
ABN , Publish Date - Sep 11 , 2025 | 03:26 AM
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ..
ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి
భారత్, అమెరికాలు సహజ భాగస్వాములన్న ప్రధాని వ్యాఖ్యలపై ఎద్దేవా
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రాజ్యసభ చైర్మన్‌గా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరింది. ఈమేరకు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జైరాం రమేష్ బుధవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ సమయంలో దేశ ప్రథమ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విలువైన మాటలను ఆయన గుర్తు చేశారు. 1952 మే 16న రాజ్యసభ తొలి సమావేశంలో సర్వేపల్లి మాట్లాడుతూ.. ‘‘నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు.. సభ సంప్రదాయాలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఉన్నత విలువలు కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది’’ అని పేర్కొన్నారని జైరాం వివరించారు. ఇలా తాను చెప్పినదాన్ని సర్వేపల్లి తుచ తప్పకుండా ఆచరించారని గుర్తుచేశారు. కాగా భారత్, అమెరికా సహజ భాగస్వాములని మోదీ పేర్కొనడంపై బుధవారం కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అదే నిజమైతే ట్రంప్ తాను వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగించి భారత్-పాకిస్థాన్‌లను కాల్పుల విరమణకు ఒప్పించానని 35 సందర్భాల్లో ఎలా పేర్కొన్నారని ప్రశ్నించింది. ఇది కూడా సహజ భాగస్వామ్యమేనా.. అని ఎద్దేవా చేసింది.