Share News

Congress Resolution: బీజేపీది నకిలీ జాతీయవాదం

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:30 AM

ఘాటుగా బీజేపీ-ఆర్‌ఎస్‌ఎ్‌సల నకిలీ జాతీయవాదాన్ని విమర్శించిన కాంగ్రెస్‌ పార్టీ, లౌకికత్వానికి తామే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. రాష్ట్రాల స్వాయత్తత, మైనారిటీల హక్కులు, న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసం పోరాడతామని ‘న్యాయపథం’ పేరుతో తీర్మానం చేసింది.

Congress Resolution: బీజేపీది నకిలీ జాతీయవాదం

కాంగ్రెస్‌ జాతీయవాదం ప్రజలను ఏకం చేస్తే.. బీజేపీ సమాజాన్ని విభజిస్తోంది

సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటాం

అహ్మదాబాద్‌ ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్‌ తీర్మానం

అహ్మదాబాద్‌, ఏప్రిల్‌ 9: జాతీయవాదం అంటే కాంగ్రెస్‌ దృష్టిలో ప్రజలను ఏకం చేసేదని.. బీజేపీ-ఆర్‌ఎ్‌సఎ్‌సల నకిలీ జాతీయవాదం పక్షపాతంతో ప్రజలను విభజించేదని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. అవి స్వార్థపూరిత అధికారం కోసం కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. రాజ్యాంగాన్ని రక్షించేది తామేనని, దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు పోరాటం చేస్తామని తెలిపింది. ఈ మేరకు బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ‘న్యాయపథం’ పేరిట కాంగ్రెస్‌ పార్టీ తీర్మానం చేసింది. ‘‘దేశంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. ముస్లింలు, క్రిస్టియన్లలో చాలా మంది భయంతో బతుకుతున్నారు. ఇది దారుణమేకాదు రాజ్యాంగ వ్యతిరేకం కూడా. వక్ఫ్‌ బోర్డుల చట్టానికి సవరణలు, చర్చిల భూములను లక్ష్యంగా చేసుకోవడం, మతపరమైన ప్రాంతాల వద్ద ఉద్దేశపూర్వక ప్రదర్శనలు వంటివి వ్యూహాత్మకంగా సాగుతున్నాయి. మతం, భాష, ప్రాంతం ఆధారంగా విభజన జరుగుతోంది. కానీ భారతీయ సాంప్రదాయమైన లౌకికత్వానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంటుంది. మా మార్గం సుస్పష్టం.. ‘విద్వేషాన్ని వీడాలి.. దేశాన్ని ఐక్యం చేయాలి’’ అని తీర్మానంలో పేర్కొంది.

అందరికీ న్యాయమే జాతీయ వాదం..

‘‘అణచివేతకు గురైనవారి హక్కులను కాపాడటమే కాంగ్రెస్‌ సిద్ధాంతం. దురదృష్టవశాత్తూ నాడు దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు జాతీయవాదం గురించి మాట్లాడుతున్నారు. భారత్‌ లౌకిక దేశంగా ఉంటుందని సర్దార్‌ పటేల్‌ ఆనాడే స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ ప్రత్యేకత. ప్రాంతం, కులం, మతం, భాష ఆధారంగా వివక్ష ఉండకూడదనేదే కాంగ్రెస్‌ సిద్ధాంతం. దానికి కట్టుబడి ఉంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్‌ ప్లాన్‌ కోసం కేంద్రంలో చట్టం చేస్తాం. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం’’ అని కాంగ్రెస్‌ తెలిపింది. బీజేపీ ప్రభుత్వంలోని నేతలు వ్యక్తిగత ప్రతిష్ట, స్వప్రయోజనాల కోసం భారత విదేశాంగ విధానాన్ని తాకట్టు పెట్టారని, బలహీనమైన నాయకత్వంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని కాంగ్రెస్‌ ఆరోపించింది.


న్యాయవ్యవస్థకు జవాబుదారీతనం కావాలి

‘‘దేశంలో ప్రతి వ్యవస్థను బలంతోనో, ప్రలోభంతోనో, అధికారంతోనో లొంగదీసుకోవడం సాధారణమైపోయింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో నోట్ల కట్టలు బయటపడటం అప్రమత్తం కావాల్సిన అంశం. దేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతినకుండా చూస్తూనే.. దాని జవాబుదారీతనం పెంచే వ్యవస్థ అత్యవసరం’’ అని కాంగ్రెస్‌ తీర్మానంలో అభిప్రాయపడింది. ‘‘జీఎస్టీ ఆదాయంలో వాటాను తగ్గిస్తూ రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనం చేస్తున్నారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక పేరిట సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్నారు’’ అని ఆరోపించింది. మరోవైపు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్‌ ప్రత్యేకంగా మరో తీర్మానం చేసింది.

పనిచేయకుంటే తప్పుకోండి: ఖర్గే

కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని, తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించని నేతలు తప్పుకుంటే మంచిదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. పార్టీలో జిల్లా అధ్యక్షుల అధికారాలు, బాధ్యతలు పెరగనున్నాయని.. అందుకే వారి ఎంపికలో కఠినంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించనున్నామని తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా నియమితులైనవారు ఏడాదిలోపు జిల్లా స్థాయి నుంచి బూత్‌ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జిల్లా అధ్యక్షులను భాగస్వామ్యం చేయనున్నట్టు తెలిపారు. ఈవీఎంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయని. అభివృద్ధి చెందిన దేశాలు కూడా తిరిగి బ్యాలెట్‌ పేపర్లకు మళ్లాయని ఖర్గే చెప్పారు. మన ఎన్నికల సంఘం మాత్రం ఈ విషయాన్ని గుర్తించదని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగేలా మోదీ సర్కారు ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తోందని ఆరోపించారు. ప్రైవేటీకరణ వల్ల దేశంలో రిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. కాగా, పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ మాట్లాడుతూ.. ప్రజల భవిష్యత్తుకు కాంగ్రెస్‌ ఆశాదీపంగా ఉండాలని సూచించారు.


ఇవి కూడా చదవండి..

Tahwwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Updated Date - Apr 10 , 2025 | 04:30 AM