Digvijaya Singh: దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో రచ్చ
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:06 AM
ఆర్‌ఎస్‌ఎస్‌ను, ప్రధాని మోదీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ పెట్టిన పోస్టు ఆ పార్టీలో కలకలం రేపుతోంది.
న్యూఢిల్లీ, డిసెంబరు 28: ఆర్‌ఎస్‌ఎస్‌ను, ప్రధాని మోదీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ పెట్టిన పోస్టు ఆ పార్టీలో కలకలం రేపుతోంది. పలువురు నాయకులు ఆయన తీరును ఆదివారం తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఆర్‌ఎ్‌సఎస్ విద్వేషంపై నిర్మితమైంది. విద్వేషం నుంచి నేర్చుకోవలసింది ఏమీ లేదు. అల్-ఖైదా నుంచి ఏమైనా నేర్చుకోగలమా’ అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ‘ఎక్స్’లో నిలదీశారు. 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ యువరక్తంతో ఉందని.. విద్వేషంపై పోరాడుతోందని తెలిపారు. ఏఐసీసీ మీడియా-పబ్లిసిటీ విభాగం చైర్మన్ పవన్ ఖేరా కూడా దిగ్విజయ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘గాడ్సేకు సంబంధించిన సంస్థ నుంచి గాంధీజీ నడిపిన కాంగ్రెస్ ఏం నేర్చుకోవాలి’ అని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలు తనపై విరుచుకుపడడంతో దిగ్విజయ్ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ‘సంఘ్ సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. అది ఆర్‌ఎ్‌సఎస్ రాజ్యాంగాన్ని గానీ, మన చట్టాలను గౌరవించదు. కానీ దాని సంస్థాగత సామర్థ్యాన్ని అభిమానిస్తాను’ అని స్పష్టం చేశారు. ‘సంఘ్‌ను ప్రశంసిస్తూ పోస్టు చేస్తే ఎందుకింత గగ్గోలు తలెత్తిందో తెలియదు. బీజేపీ అగ్ర నేత ఆడ్వాణీ కాళ్ల వద్ద మోదీ కూర్చున్న ఫొటో ‘కోరా’లో నాకు కనబడింది. చాలా బాగుందనిపించింది. ఆ తర్వాత ఆయన సీఎం అయ్యారు. ప్రధాని అయ్యారు. అది ఆర్‌ఎ్‌సఎస్ బలం వల్లే. లేదంటే మోదీకి అంత సత్తా ఎక్కడుంది’ అని ప్రశ్నించారు. రాహుల్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నారని, డీసీసీలన నియమించారని గుర్తు చేశారు. దిగ్విజయ్ పోస్టును కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సమర్థించారు. కాంగ్రె్‌సను సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.. ఇందుకోసం ఆత్మశోధన అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయ విజయాలకు క్రమశిక్షణ ముఖ్యమన్నారు. సంస్థాగత సంస్కరణలను తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు.