Election Commission: ఓటు రక్షకులు వస్తున్నారు!
ABN , Publish Date - Sep 25 , 2025 | 03:44 AM
ఓట్ల చోరీ’పై ఈసీని తప్పుబడుతూ పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్ల రక్షకులను రంగంలోకి దింపుతోంది. ఓటరు జాబితాలను పరిశీలించి ఓటు చేర్పు, తొలగింపు...
ఓట్ల చోరీ’ కట్టడిలో భాగంగా నియమించనున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 : ‘ఓట్ల చోరీ’పై ఈసీని తప్పుబడుతూ పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్ల రక్షకులను రంగంలోకి దింపుతోంది. ఓటరు జాబితాలను పరిశీలించి ఓటు చేర్పు, తొలగింపుల్లో గుర్తించిన అక్రమాలను ‘ఓట్ల రక్షకులు’ ఈసీ దృష్టికి తీసుకెళతారు. ఇందుకు అవసరమైన శిక్షణను వీరికి కాంగ్రెస్ ఇస్తుంది. ఈ మొత్తం కార్యక్రమాన్ని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక వాధ్రా పర్యవేక్షిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓట్ల రక్షకుల తుది జాబితా ఖరారు, వారికి శిక్షణ ఆమె ఆధ్వర్యంలో చేపడుతున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో భాగంగా.. ప్రయోగాత్మకంగా తొలుత ఐదు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో వీరిని నియమిస్తారు. గత లోక్‌సభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన రాజస్థాన్ రూరల్, ఆల్వార్ (రాజస్థాన్); కాంకేర్ (ఛత్తీ్‌సగఢ్), మొరేనా(మధ్యప్రదేశ్), బాస్గావ్(యూపీ)లను ఇందుకోసం ఎంపిక చేశారు. ఇరవై పోలింగ్ కేంద్రాలకు ఒకరి చొప్పున ఒక లోక్‌సభ పరిధిలో 100 మందిని నియమిస్తారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి సమక్షంలోనే శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ తర్వాత 20వేలు కంటే తక్కువ ఓట్ల తేడాతో కోల్పోయిన మరో ఐదు స్థానాలను ఎంపిక చేయనున్నారు. కాగా, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై రాహుల్‌గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లచోరీ వ్మవహారంలో సీఐడీ అడిగిన ఆధారాలను ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. అలంద్‌లో ఓటరు జాబితానుంచి కొందరి పేర్లు ఈసీ తొలగించిందనేది తేలిపోయిందని రాహుల్ వ్యాఖ్యానించారు.