Congress Demands Judicial Probe: లద్దాఖ్‌ను దగా చేసిన మోదీ సర్కార్
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:41 AM
లద్దాఖ్‌ను మోదీ సర్కారు దగా చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఉద్యమకారులపై పోలీసులు జరిపిన కాల్పులపై న్యాయ....
పోలీసు కాల్పులపై న్యాయ విచారణ జరిపించాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: లద్దాఖ్‌ను మోదీ సర్కారు దగా చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఉద్యమకారులపై పోలీసులు జరిపిన కాల్పులపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. పోలీసు కాల్పుల్లో నలుగురు మరణించారని, అందులో ఒకరు కార్గిల్ పోరాట వీరుడు ఉండడం మరింత విషాదకరమని పేర్కొంది. కార్గిల్‌లో యుద్ధంలో పాల్గొన్న సెవాంగ్ థార్చిన్ ప్రాణాలు కోల్పోయారని, ఆయన తండ్రి కూడా మాజీ సైనికుడేనని తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో థార్చిన్ తండ్రి వీడియోను పోస్టు చేశారు. లద్దాఖ్ విషాదం దేశమంతటికీ విషాదమని పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణ అమెరికా పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సామాజిక మాధ్యమాల్లో థార్చిన్ తండ్రి వీడియో పోస్టు చేశారు. ‘తండ్రి సైన్యంలో పని చేశారు. కుమారుడు కూడా సైనికుడే. దేశభక్తి వారి రక్తంలో ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం భారత మాత వీర కుమారుడిని కాల్చి చంపింది. కారణం..లద్దాఖ్ హక్కుల కోసం నిలబడడమే. బాధతో నీరు నిండిన ఆ తండ్రి కళ్లు ఒకే ప్రశ్న అడుగుతున్నాయి...దేశ సేవకు ఇదా ప్రతిపలం అని..’’ అంటూ హిందీలో పోస్టు పెట్టారు.