President Mallikarjun Kharge: మల్లికార్జున ఖర్గేకు పేస్‌మేకర్
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:06 AM
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వల్ప అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. మంగళవారం సదాశివనగర్‌లోని నివాసంలో ఉండగా ఆయనకు..
హార్ట్ బీట్‌లో వ్యత్యాసం ఉండడంతో అమర్చిన వైద్యులు
బెంగళూరు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వల్ప అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. మంగళవారం సదాశివనగర్‌లోని నివాసంలో ఉండగా ఆయనకు శ్వాసకోశ సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు వెంటనే బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. హార్ట్ బీట్‌లో వ్యత్యాసం ఉండడంతో వైద్యులు బుధవారం ఆయనకు పేస్‌మేకర్ అమర్చినట్టు ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు. ‘వయో సంబంధిత సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఖర్గే ఆస్పత్రిలో చేరారు. హృదయ స్పందనలో తేడా ఉండడంతో దాన్ని సరిచేసేందుకు వైద్యులు ఆయన గుండెకు పేస్‌మేకర్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒకరోజు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు’ అని పేర్కొంటూ ప్రియాంక్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. సీఎం సిద్దరామయ్య బుధవారం ఆస్పత్రికి వెళ్లి ఖర్గేను పరామర్శించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ఖర్గే ఆరోగ్యంగా ఉన్నారని, గురువారం డిశ్చార్జ్ అవుతారని చెప్పారు.