Dharmasthala Burial Controversy: శవాలు లభించకుంటే నేనేం చేయాలి
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:20 AM
ధర్మస్థలలో మృతదేహాల ఖననం వివాదంపై నెలరోజుల తర్వాత ఫిర్యాదిదారుడు తొలిసారిగా గురువారం ఓ ..
అటవీ ప్రాంతంలోనే పూడ్చా.. నాతోపాటు నలుగురున్నారు
ధర్మస్థల వివాదంపై ఫిర్యాదిదారుడు
తొలిసారిగా మీడియాకు వివరాలు
బెంగళూరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ధర్మస్థలలో మృతదేహాల ఖననం వివాదంపై నెలరోజుల తర్వాత ఫిర్యాదిదారుడు తొలిసారిగా గురువారం ఓ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి దాకా సిట్ అధికారులకు మాత్రమే అతడు సమాచారమిచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధర్మస్థలలో తాను పౌరకార్మికుడిగా పనిచేశానని, చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకునేందుకు 11 ఏళ్ల తర్వాత వచ్చానని అన్నారు. మృతదేహాలను పూడ్చిపెట్టిన స్థలాలనే చూపానని, అక్కడ మృతదేహాలు లభించకుంటే తానేం చేయాలని ప్రశ్నించారు. 1995 నుంచి 2014 వరకూ పౌరకార్మికుడిగా తాను పనిచేశానని, తనతోపాటు నలుగురు వ్యక్తులు వెంట ఉండేవారని అన్నారు. వారిలో తన సొంత బావ కూడా ఉన్నారని తెలిపారు. బాహుబలి కొండపై ఓ మహిళ మృతదేహాన్ని పూడ్చానని, నేత్రావతి నదిలో 70 నుంచి 80 దాకా శవాలను సమాధి చేశామని, వాటిని స్థానికులు కొందరు చూశారని అన్నారు. తాము శవాలను పూడ్చేవారమని, అదే తమ పని అని తెలిపారు. సుమారు 100 మృతదేహాలను పాతిపెట్టామని, అందులో 90 దాకా మహిళలవే అని పేర్కొన్నారు. కొన్ని దేహాలపై గాయాలు ఉండేవన్నారు. లైంగిక దౌర్జన్యం జరిగిన విషయాన్ని వైద్యులు నిర్ధారించగలరని తెలిపారు. తాను మృతదేహాలను పాతిపెట్టి పదేళ్లు దాటిందని, ఇప్పుడు అడవిలోకి వెళ్లే దారిలేదని, కొన్ని చోట్ల పెద్దచెట్లు పెరిగాయని అన్నారు. 13 చోట్ల తవ్వకాల్లో ఒక మహిళ మృతదేహం కూడా లభించలేదనే ప్రశ్నకు సమాధానంగా, తాను చెప్పినదంతా వాస్తవమేనని చెప్పారు. ఇప్పటి దాకా తానొక్కడినే మృతదేహాలను పూడ్చానని చెప్పుకున్న ఫిర్యాదిదారుడు, ఇప్పుడు తనతో పాటు నలుగురు ఉన్నట్లు చెప్పడం గమనార్హం.
మధ్యంతర నివేదికను బయటపెట్టండి
ధర్మస్థలలో ఏం జరుగుతోందని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సునిల్‌కుమార్ ప్రశ్నించారు. సిట్ ఏర్పాటు చేసి దాదాపు నెలరోజులవుతోందని, సిట్ మధ్యంతర నివేదికలో ఏముందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘బెంగళూరు డీజే హళ్లిలో ఓ యువకుడు ఓ మతానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టినందుకు ఏకంగా ఓ ఎమ్మెల్యే ఇంటికి, పోలీసుస్టేషన్‌కు నిప్పు పెట్టారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సిద్దరామయ్య, ఆ మతం వారి మనోభావాలు దెబ్బతిన్నందుకే వివాదం జరిగిందని చెప్పారు. అదే ధర్మస్థల గురించి, మంజునాథస్వామి ఫొటోలతో చదివేందుకు సాఽధ్యం కాని రీతిలో నిత్యం పోస్టులు పెడుతున్నా చర్యలు లేవు. ధర్మస్థల విషయంలో ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి ఆలయం, ధర్మకర్తల కుటుంబంపై వందలాది పోస్టులు పెడుతున్నారు. మరి అక్కడ హిందువులకు మనోభావాలు ఉండవా? ఫిర్యాదు చేసిన వెంటనే సిట్ ఏర్పాటుకు కేరళ ప్రభుత్వం ఎంతో ఉత్సాహం చూపుతోంది’ అని విమర్శించారు. మరో వైపు దుబాయి నుంచి భారీగా నిధులు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. సిట్-2ను ఏర్పాటు చేసి, ధర్మస్థల వివాదంలో సూత్రధారులు, పాత్రధారులు, వారికి సొమ్ము సమకూర్చిన వారెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 18జిల్లాల్లో ధర్మస్థలకు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయని, రాష్ట్రమంతటా భక్తులు రోడ్డెక్కితే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరించారు.