IndiGo Amid Flight Disruptions: ఇండిగోపై కాంపిటీషన్ కమిషన్ నజర్!
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:15 AM
ఇండిగో సంక్షోభంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా దృష్టిపెట్టింది. భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దుతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపడిన నేపథ్యంలో..
పోటీ నిబంధనలను ఉల్లంఘించిందా?
తదితర అంశాలపై పరిశీలన
కొనసాగుతున్న డీజీసీఏ దర్యాప్తు
నలుగురు ఫ్లైట్ ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్లపై వేటు
న్యూఢిల్లీ, డిసెంబరు 12: ఇండిగో సంక్షోభంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా దృష్టిపెట్టింది. భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దుతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపడిన నేపథ్యంలో.. ఈ అంశాన్ని సుమోటోగా పరిశీలనకు తీసుకుంది. దేశ విమానయాన రంగంలో 65శాతానికిపైగా వాటాతో ఆధిపత్యం కలిగి ఉండటం, కొన్ని మార్గాల్లో పూర్తి ఆధిపత్యం వంటివి ప్రయాణికుల ఇబ్బందులకు కారణమయ్యాయా? సహజ పోటీ నిబంధనలను ఇండిగో ఏమైనా ఉల్లంఘించిందా? తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందా అనే అంశాలను పరిశీలిస్తున్నట్టు సీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ పరిశీలనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఇండిగో సంక్షోభంపై డీజీసీఏ ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, ఇతర ఉన్నతాధికారులు శుక్రవారం మరోసారి డీజీసీఏ ఎదుట హాజరయ్యారు. ఇక ఇండిగో సర్వీసుల భద్రత, నిర్వహణ ప్రమాణాలను పర్యవేక్షించే నలుగురు ‘ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌వోఐ)లపై డీజీసీఏ వేటు వేసింది. భారీగా విమానాల రద్దు పరిస్థితికి దారితీసిన కారణాలను తేల్చేందుకు నిపుణులతో పరిశీలన జరిపించాలని ఇండిగో బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ‘చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌సీ’ సంస్థకు బాధ్యత అప్పగించింది. మరోవైపు 2020-21 నాటి పన్ను చెల్లింపులకు సంబంధించి ఇండిగోకు తాజాగా వాణిజ్య పన్నుల శాఖ రూ.58.75 కోట్లు జరిమానా విధించింది.