Share News

Anil Ambani: అనిల్‌ అంబానీ గ్రూప్‌లో42,000 కోట్ల ఆర్థిక మోసాలు

ABN , Publish Date - Oct 31 , 2025 | 03:31 AM

అంబానీ సోదరుల్లో ఒకరైన అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌లో భారీ ఆర్థిక మోసం జరిగిందని ఇన్వెస్టిగేటివ్‌ పోర్టల్‌ కోబ్రా పోస్ట్‌ బయటపెట్టింది...

Anil Ambani: అనిల్‌ అంబానీ గ్రూప్‌లో42,000 కోట్ల ఆర్థిక మోసాలు

  • బయటపెట్టిన కోబ్రా పోస్ట్‌.. తోసిపుచ్చిన రిలయన్స్‌ గ్రూప్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 30: అంబానీ సోదరుల్లో ఒకరైన అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌లో భారీ ఆర్థిక మోసం జరిగిందని ఇన్వెస్టిగేటివ్‌ పోర్టల్‌ కోబ్రా పోస్ట్‌ బయటపెట్టింది. 2006 సంవత్సరం నుంచి గ్రూప్‌ కంపెనీలు రూ.41,921 కోట్లకు పైబడిన నిధులు దారి మళ్లించాయని పేర్కొంది. అనిల్‌ అంబానీ గ్రూప్‌ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ కంపెనీల షేరు ధరలు పడిపోయేలా చేసేందుకు చేస్తున్న దుష్ప్రచారంగా దాన్ని వివరించింది. రిలయన్స్‌ గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీలు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ బ్యాంక్‌ రుణాలు, ఐపీఓలు/బాండ్ల జారీ ద్వారా సేకరించిన నిధులు అన్నీ కలిపి రూ.28,874 కోట్లు ప్రమోటర్లతో అనుబంధం ఉన్న కంపెనీల్లోకి దారి మళ్లించినట్టు కోబ్రా పోస్ట్‌ ఆ కథనంలో తెలిపింది. ఇది కాకుండా మరో రూ.13,047 కోట్లు.. సింగపూర్‌, మారిషస్‌, సైప్రస్‌, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, అమెరికా, యూకేల్లోని విదేశీ సంస్థల నుంచి డొల్ల కంపెనీల ద్వారా మోసపూరితమైన విధానంలో దేశానికి తరలించారని కూడా ఆరోపించింది.

నిబంధనల ఉల్లంఘన

ఈ క్రమంలో కంపెనీల చట్టం, ఫెమా, పీఎంఎల్‌ఏ, సెబీ, ఆదాయపు పన్ను చట్టం వంటి విభిన్న చట్టాల్లోని నిబంధనలు ఉల్లంఘించినట్టు కూడా తెలిపింది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సెబీ, ఎస్‌సీఎల్‌టీ, ఆర్‌బీఐ, విదేశీ నియంత్రణ సంస్థల ఉత్తర్వులు, ఫైలింగ్‌ల ఆధారంగా తాను ఈ వివరాలు సేకరించినట్టు కోబ్రా పోస్ట్‌ తెలిపింది. ఈ నిధులను వ్యక్తిగత విలాసాల కోసం వినియోగించిన క్రమంలో ఒక ఉదాహరణ చూపుతూ 2008 సంవత్సరంలో అనిల్‌ అంబానీ తన గ్రూప్‌లోని ఒక లిస్టెడ్‌ కంపెనీ నిధులతో 2 కోట్ల డాలర్ల విలువ గల ఒక యాచ్‌ కొనుగోలు చేసినట్టు తెలిపింది. ఇలా నిధులు దారి మళ్లించేందుకు అనిల్‌ ధీరూభాయ్‌ గ్రూప్‌ (అడాగ్‌).. ప్రత్యేక కంపెనీలు లేదా ఎస్‌పీవీలు ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. తొలుత ఈ కంపెనీలకు నిధులు బదిలీ చేసి ఆ తర్వాత వాటన్నింటినీ కొట్టి వేయడం వంటి చర్యల ప్రభావం వల్ల గ్రూప్‌లోని మొత్తం ఆరు లిస్టెడ్‌ కంపెనీలు ఆర్థిక కష్టాల్లో పడ్డాయని కోబ్రా పోస్ట్‌ వెల్లడించింది.

Updated Date - Oct 31 , 2025 | 03:31 AM