Share News

CM Revanth Requests: హైదరాబాద్‌ బందర్‌ మధ్య 12 వరుసల కొత్త రోడ్డుకు అనుమతివ్వండి

ABN , Publish Date - Sep 10 , 2025 | 04:03 AM

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు...

CM Revanth Requests: హైదరాబాద్‌ బందర్‌ మధ్య 12 వరుసల  కొత్త రోడ్డుకు అనుమతివ్వండి

  • ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరం పనులు ప్రారంభించండి.. శ్రీశైలానికి 4వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌ కావాలి

  • హైదరాబాద్‌-మంచిర్యాల మధ్య కొత్త రోడ్డు వేయాలి

  • కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం రేవంత్‌ వినతి

  • 868 కోట్ల పనులకు వారంలో అనుమతిస్తాం.. కొత్త రోడ్లపై చర్చకు అధికారుల్ని పంపుతా: గడ్కరీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకా రం తెలంగాణ-ఏపీ రాజధానుల మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మించాల్సి ఉందని గుర్తుచేశారు. తెలంగాణకు సముద్రమార్గం లేనందున బందరు పోర్టు వరకు సరకు రవాణాకు వీలుగా గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి మంజూరు చేయాలని కోరారు. ఈ రహదారిలో 118 కిలోమీటర్లు తెలంగాణలో ఉంటుందని మిగతా భాగం ఏపీలో ఉంటుందని వివిరించారు. మంగళవారం కేంద్రమంత్రిని ఆయన నివాసంలో రేవంత్‌ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతులు, పనుల వేగవంతం చేయాల్సిన అవసరంపై కేంద్రమంత్రితో చర్చించారు. హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి 90ు భూసేకరణ పూర్తయిందని తెలిపారు. వెంటనే ఆర్థిక అనుమతి, కేంద్రమంత్రివర్గ అనుమతి ఇచ్చి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరభాగం పనులతోనే దక్షిణభాగం పనులు కూడా చేపట్టాలని కోరారు. దీనికి సంబంధించిన అనుమతులు వేగంగా ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌ను ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంతో అనుసంధానించే మన్ననూర్‌-శ్రీశైలం రహదారి అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో ఉన్నందున నాలుగు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి తోడుగా ఓఆర్‌ఆర్‌ దగ్గర రావిర్యాల నుంచి ఆమనగల్‌ మీదుగా మన్ననూరు వరకు నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని నిర్మించాలని కోరా రు. అలాగే, హైదరాబాద్‌-మంచిర్యాల మధ్య ఉన్న రాజీవ్‌ రహదారిపై వాహన రద్దీ అధికంగా ఉన్నందున.. నూతన గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఆర్‌ఐఎఫ్‌ కింద రూ.868 కోట్లతో ప్రతిపాదించిన రహదారుల పనులను మంజూరు చేయాలని కోరారు. ఈ వినతుల పట్ల నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్‌ఐఎఫ్‌ పనులకు వారం లోపు అనుమతులు ఇస్తామని తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి సంబంధించి తమ శాఖ అధికారులను హైదరాబాద్‌కు పంపుతానని హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో ఈ నెల 22న హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహిస్తామని రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రికి తెలిపారు.

Updated Date - Sep 10 , 2025 | 04:03 AM