CJI Mother Kamaltai Gavai Decline: ఆర్‌ఎస్‌ఎస్ సభకు హాజరుకావడం లేదు
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:15 AM
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి సందర్భంగా నిర్వహించే సభకు తాను హాజరుకావడం లేదని సుప్రీంకోర్టు...
నాగ్‌పూర్, అమరావతి, అక్టోబరు1: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి సందర్భంగా నిర్వహించే సభకు తాను హాజరుకావడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ మాతృమూర్తి డాక్టర్ కమల్‌తాయ్ గవాయ్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర అమరావతిలో అక్టోబరు 5న జరిగే కార్యక్రమానికి హాజరౌతున్నట్లు వార్తలు వెలువడగానే విమర్శలు చెలరేగి వివాదంగా మారడంతో హాజరు కారాదని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తమ కుటుంబం అంబేడ్కర్ సిద్ధాంతాన్ని అనురిస్తుందని, అంబేడ్కర్ వాదాన్ని వినిపించేందుకు తన భర్త దాదా సాహెబ్ కావాలనే వేరే సంస్థలు నిర్వహించే సభలకు హాజరయ్యేవారని గుర్తు చేశారు. ఈ నెల 5న జరిగే కార్యక్రమానికి హాజరైతే అదే వేదికపైనుంచి అంబేడ్కర్ వాదాన్ని వినిపించేందుకు అవకాశం లభించి ఉండేదన్నారు. ప్రస్తుతం అనారోగ్య కారణాలతో తాను చికిత్స తీసుకుంటున్నట్లు గవాయ్ చెప్పారు. అంతకు ముందు ఈ నెల 28న కమల్‌తాయ్ చేతిరాత అంటూ ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను ఆర్‌ఎ్‌సఎస్ సభకు హాజరవుతున్నట్లుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఇదంతా ఆర్‌ఎ్‌సఎస్ చేస్తున్న కుట్ర అని రాసినట్లుగా ఆ లేఖలో ఉంది. అయితే ఇది నకిలీ లేఖ అని, అది తన తల్లి రాసినది కాదని ఆమె చిన్న కుమారుడు రాజేంద్ర గవాయ్ స్పష్టం చేశారు. దాదాసాహెబ్ గవాయ్ చారిటబుల్ ట్రస్ట్‌కు వ్యవస్థాపక చైర్‌పర్సన్‌గా ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో తన తల్లికి ఆర్‌ఎ్‌సఎస్ నేతల నుంచి ఆహ్వానం అందిందని, ముఖ్య అతిథిగా వెళ్లేందుకు ఆమె అంగీకరించారని ఆయన వెల్లడించారు.