Chirag Paswan Emerges as Young Bihar Leader: చిరాగ్ కమాల్!
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:27 AM
బిహార్‌లో ఎన్డీయే ఘన విజయం సొంతం చేసుకుంది. ఎన్డీయే పక్షాలు ఐక్యంగా పనిచేసి మరోసారి అధికారం నిలబెట్టుకున్నాయి....
యువ బిహారీగా అవతరణ
ఫలితాల్లో అనూహ్య దూకుడు
సీట్లలో 67ు స్ట్రైకింగ్ రేట్
న్యూఢిల్లీ, నవంబరు 14 : బిహార్‌లో ఎన్డీయే ఘన విజయం సొంతం చేసుకుంది. ఎన్డీయే పక్షాలు ఐక్యంగా పనిచేసి మరోసారి అధికారం నిలబెట్టుకున్నాయి. ఎన్డీయేలోని పార్టీలు బీజేపీ, జేడీయూ గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సొంతం చేసుకోగా, మరో భాగస్వామి చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అనూహ్యంగా దూసుకొచ్చింది. పోటీచేసిన 28 స్థానాల్లో 19 చోట్ల... 67 శాతం స్ర్టైకింగ్ రేట్‌తో సత్తా చాటి ‘యువ బిహారీ’గా చిరాగ్ అవతరించారు. రామ్ విలాస్ నాయకత్వంలో లోక్‌జనశక్తి పార్టీ 2005లో 29 చోట్ల విజయం సాధించింది. ఆ పార్టీ ఏర్పాటయ్యాక అదే అత్యున్నత ప్రదర్శన.
ప్రతి దశలోనూ ఎదురీతే..
2020లో ఎన్డీయే సీఎం నితీశ్‌కుమార్‌ను బహిరంగంగా ఆయన వ్యతిరేకించి. బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నారు. 137 చోట్ల పోటీచేసి ఒక్క స్థానమే చిరాగ్ గెలిచారు. ఆ వెంటనే పార్టీలో సంక్షోభంతో తండ్రి రామ్ విలాస్ పాసవాన్ అధికార నివాసా న్నీ, ఆయన పార్టీనీ.. రెండింటినీ కోల్పోయి.. చిరాగ్ వేరే పార్టీని పెట్టుకున్నారు. మోదీకి తాను హనుమంతుడినని చెప్పుకొనేవారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 5కు 5 సీట్లూ గెలిచారు. రామ్ విలాస్‌కు చిరాగ్ తగిన వారసుడని బీజేపీ సరిగ్గానే గుర్తించింది. గత ఏడాది కేంద్ర మంత్రి పదవిని ఇచ్చి రాజకీయంగా ఆయన ఎదుగుదలకు తోడ్పడింది. సీఎం పదవిని కోరుకుంటున్నట్టు దాపరికం లేకుండా చెప్పేవారు.