Share News

High-Speed Rail: 700 కి.మీ.ల వేగం 2 సెకన్లలో..

ABN , Publish Date - Dec 28 , 2025 | 06:03 AM

ప్రపంచ రైల్వే చరిత్రలో చైనా సంచలనం సృష్టించింది. అత్యాధునిక సూపర్‌ కండక్టింగ్‌ మాగ్నెటిక్‌ లెవిటేషన్‌(మ్యాగ్లెవ్‌) రైలు ప్రయోగంలో 2 సెకండల్లో 700 కిమీల వేగాన్ని అందుకొని ప్రపంచ రికార్డు సృష్టించింది.

High-Speed Rail: 700 కి.మీ.ల వేగం 2 సెకన్లలో..

  • వేగంలో సరికొత్త రికార్డు సృష్టించిన చైనా శాస్త్రవేత్తలు

  • సూపర్‌ కండక్టింగ్‌ మ్యాగ్లెవ్‌ రైలుపై ప్రయోగం

  • అలా్ట్ర హైస్పీడ్‌ రైళ్లకు మార్గం

న్యూఢిల్లీ, డిసెంబరు 27: ప్రపంచ రైల్వే చరిత్రలో చైనా సంచలనం సృష్టించింది. అత్యాధునిక సూపర్‌ కండక్టింగ్‌ మాగ్నెటిక్‌ లెవిటేషన్‌(మ్యాగ్లెవ్‌) రైలు ప్రయోగంలో 2 సెకండల్లో 700 కిమీల వేగాన్ని అందుకొని ప్రపంచ రికార్డు సృష్టించింది. అయస్కాంతాల సాయంతో ఏ వస్తువునైనా గాలిలో తేలియాడేలా చేయడాన్ని మ్యాగ్నెటిక్‌ లెవిటేషన్‌ అంటారు. ఈ మ్యాగ్లెవ్‌ సాంకేతికతతో ప్రయాణించే రైళ్లకు చక్రాలు ఉండవు. పట్టాలకు కొన్ని సెంటీమీటర్ల ఎత్తులో గాల్లో తేలుతూ ఉండే రైలు.. విద్యుత్‌ అయస్కాంత శక్తి సాయంతో మెరుపు వేగంతో ముందుకు దూసుకెళుతోంది. ఈ మ్యాగ్లెవ్‌ టెక్నాలజీపై చైనా నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ నేషనల్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు పదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన పరీక్షలో వారు అద్భుత ఫలితాన్ని సాధించారు. 400 మీటర్ల (1310 అడుగులు) మ్యాగ్లెవ్‌ ట్రాక్‌పై టన్ను(1000 కిలోలు) బరువు ఉన్న టెస్ట్‌ వెహికల్‌ను పరీక్షించగా అది 2 సెకండల్లో 700 కిమీల వేగాన్ని అందుకుంది. రెప్పపాటులో కంటి ముందు నుంచి మాయమైంది. అంతేకాక నిర్దేశిత గమ్యస్థానానికి సురక్షితంగా చేరింది. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. ఇదే శాస్త్రవేత్తల బృందం జనవరిలో నిర్వహించిన పరీక్షలో మ్యాగ్లెవ్‌ రైలు 648 కిమీల గరిష్ఠ వేగాన్ని అందుకుంది. తాజా ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో చైనా చేసే అలా్ట్ర హైస్పీడ్‌ మ్యాగ్లెవ్‌ పరిశోధనలు మరింత వేగవంతం అయ్యే అవకాశముంది.

Updated Date - Dec 28 , 2025 | 06:05 AM