Share News

Massive Dam Project: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్‌

ABN , Publish Date - Jul 20 , 2025 | 06:07 AM

భారత్‌లోని కొన్ని రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్‌కు ఆయువుపట్టు బ్రహ్మపుత్ర నదిపై అతి భారీ డ్యామ్‌ నిర్మాణాన్ని చైనా తాజాగా ప్రారంభించింది. అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీపంలో టిబెట్‌లోని న్యింగ్‌చి ప్రాంతంలో ఈ డ్యామ్‌...

Massive Dam Project: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్‌

  • అరుణాచల్‌కు సమీపంలోని న్యింగ్‌చిలో నిర్మాణం

  • రూ.14.4 లక్షల కోట్లతో 5జల విద్యుత్‌ కేంద్రాలు

  • పనులను ప్రారంభించిన చైనా ప్రధాని లీ కియాంగ్‌

న్యూఢిల్లీ, జూలై 19: భారత్‌లోని కొన్ని రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్‌కు ఆయువుపట్టు బ్రహ్మపుత్ర నదిపై అతి భారీ డ్యామ్‌ నిర్మాణాన్ని చైనా తాజాగా ప్రారంభించింది. అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీపంలో టిబెట్‌లోని న్యింగ్‌చి ప్రాంతంలో ఈ డ్యామ్‌ నిర్మాణానికి చైనా ప్రధాన మంత్రి లి కియాంగ్‌ తాజాగా ప్రారంభోత్సవం చేసినట్టు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. టిబెట్‌తోపాటు ఇతర ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు వీలుగా.. డ్యామ్‌తోపాటు దానిపై ఐదు జల విద్యుత్‌ కేంద్రాలను రూ.14.4 లక్షల కోట్ల (167 బిలియన్‌ డాలర్లు)తో నిర్మిస్తున్నట్టు తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్‌ ప్రాజెక్టు అయిన త్రీగోర్జెస్‌ డ్యామ్‌ కంటే కూడా.. ఈ కొత్త డ్యామ్‌తో ఎక్కువ జల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని అంచనా. చైనాలోని యాంగ్జె నదిపై ఉన్న త్రీగోర్జెస్‌ డ్యామ్‌ జల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 22,400 మెగావాట్లు కావడం గమనార్హం. ఇప్పుడు బ్రహ్మపుత్ర (చైనాలో యార్లుంగ్‌ త్సాంగ్‌పోగా పిలుస్తారు)పై కడుతున్న కొత్త డ్యామ్‌లో భారీ స్థాయిలో నీటిని నిల్వ చేసే క్రమంలో.. దిగువన ఉన్న భారత్‌, బంగ్లాదేశ్‌లపై ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. గత ఏడాది డిసెంబర్‌లో చైనా ఈ ప్రాజెక్టు నిర్మాణంపై నిర్ణయం తీసుకుంది. అప్పుడే భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. బ్రహ్మపుత్ర నది పరీవాహకంలో దిగువన ఉన్న దేశాల ప్రయోజనాలకు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ డిమాండ్‌ చేశారు. దానిపై స్పందించిన చైనా తాము నిర్మిస్తున్న డ్యామ్‌తో భారత్‌కు నీటి ప్రవాహంపై ఎలాంటి ప్రభావం పడదని ప్రకటించింది. అయినా హిమాలయాల ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ అతి భారీ డ్యామ్‌తో పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jul 20 , 2025 | 06:08 AM