Aircraft Carrier Fujian: చైనా విమాన వాహక యుద్ధనౌక ఫుజియాన్ ప్రారంభం
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:02 AM
చైనా మూడో విమాన వాహక యుద్ధనౌక ఫుజియాన్‌ను రహస్యంగా ప్రారంభించింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యారు...
బీజింగ్, నవంబరు 7: చైనా మూడో విమాన వాహక యుద్ధనౌక ఫుజియాన్‌ను రహస్యంగా ప్రారంభించింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యారు. బుధవారం దక్షిణ చైనాలోని హైనన్ ప్రావిన్స్‌లో ఉన్న సాన్యా పోర్టులో జిన్‌పింగ్ జెండా ఊపి అత్యంత అధునాతన యుద్ధనౌకను ప్రారంభించారని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జిన్‌హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. అయితే అధికారిక మీడియా మాత్రం ఫుజియాన్‌ను శుక్రవారం ప్రారంభించారని తెలిపింది. ఇంతకుముందు చైనా 2012లో లియావోనింగ్, 2019లో షాన్‌డాంగ్ విమాన వాహక యుద్ధ నౌకలను ప్రారంభించింది. వీటికన్నా ఫుజియాన్ పెద్దది. దీని బరువు 80 వేల టన్నులు.చైనా మిలిటరీ కమాండర్ సోంగ్ జోంగ్‌పింగ్ మాట్లాడుతూ ‘‘ఫ్లాట్ డెక్‌తో ఉన్న చైనా తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఇది. ఆధునిక పరిజ్ఞానంతో తయారైంది. ఎలకో్ట్రమ్యాగ్నెటిక్ క్యాటపుల్ట్స్, ఎలకో్ట్రమ్యాగ్నెటిక్ అరెస్టింగ్ గేర్, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థ ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. అధునాతన ఫుజియాన్‌లో విద్యుదయస్కాంత విమాన ప్రయోగ వ్యవస్థ (ఈఎంఏఎల్‌ఎ్‌స)ను అమర్చారు. ఈ వ్యవస్థను అమెరికా విమాన వాహక యుద్ధనౌక యూఎ్‌సఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌లో మాత్రమే వినియోగించారు. చైనా ప్రవేశపెట్టిన మూడు విమాన వాహక యుద్ధనౌకల్లో సంప్రదాయ ఇంధనాన్ని మాత్రమే వినియోగిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలోనే కాకుండా భారత్‌కు సమీపంలోని హిందూ మహాసముద్రంలోనూ, అరేబియా సముద్రంలోనూ ఫుజియాన్‌ను మోహరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.