Share News

Children Forced to Eat Midday Meal: న్యూస్‌ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం!

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:30 AM

మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు న్యూస్‌ పేపర్‌ ముక్కల్లో మధ్యాహ్న భోజనం తింటున్న ఓ వీడియోను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో షేర్‌ చేశారు....

Children Forced to Eat Midday Meal: న్యూస్‌ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం!

  • మధ్యప్రదేశ్‌లోని ఓ బడిలో ఘటన

  • నా హృదయం ముక్కలైంది: రాహుల్‌

న్యూఢిల్లీ, నవంబరు 8: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు న్యూస్‌ పేపర్‌ ముక్కల్లో మధ్యాహ్న భోజనం తింటున్న ఓ వీడియోను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో షేర్‌ చేశారు. షియోపూర్‌ జిల్లా హల్పూర్‌ గ్రామంలోని ఓ మాధ్యమిక పాఠశాలలో ఈ ఘటన వెలుగుచూసింది. బడి కాంపౌండ్‌లో చెత్తాచెదారం మధ్య పిల్లలు వరుసగా కూర్చొని న్యూస్‌ పేపర్‌ ముక్కల్లో ఉన్న ఆహారాన్ని తింటున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వీడియోలోని దృశ్యాలను చూసి తన హృదయం ముక్కలైందని రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు అయిన ఏ పాపం ఎరుగని చిన్నారులకు కనీసం ప్లేట్లలో భోజనం చేసే గౌరవం కూడా దక్కకూడదా? అంటూ రాహుల్‌ హిందీలో ట్వీట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌ను 20 ఏళ్లకు పైగా ఏలుతున్న బీజేపీ.. చిన్నారుల కంచాలను కూడా దొంగిలించిందని ఆరోపించారు. ఇలా చిన్నారుల భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నందుకు మధ్యప్రదేశ్‌ సీఎం, ప్రధాని మోదీ సిగ్గుపడాలి అని రాహుల్‌ మండిపడ్డారు. పీఎం పోషణ్‌ పథకం కింద ఓ స్వయం సహాయక బృందానికి హల్పూర్‌ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డించే కాంట్రాక్టును అప్పగించారు. తాజా వీడియో నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌, సదరు స్వయం సహాయక బృందాన్ని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులు శనివారం ఈ పాఠశాలకు స్టీల్‌ ప్లేట్లను పంపించారు.

Updated Date - Nov 09 , 2025 | 01:30 AM