Share News

Chidambaram Reveals: ముంబై దాడులకు ప్రతీకారం తీర్చుకుందామనుకున్నాం

ABN , Publish Date - Oct 01 , 2025 | 01:52 AM

ముంబై ఉగ్రదాడులకుగాను పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుందామనుకున్నాని, అమెరికా వారించడంతో ఆగామని కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం తెలిపారు...

Chidambaram Reveals: ముంబై దాడులకు ప్రతీకారం తీర్చుకుందామనుకున్నాం

  • పాకిస్థాన్‌తో యుద్ధంపై ప్రధానితో చర్చించాను

  • మన్మోహన్‌ సింగ్‌ కూడా సుముఖత చూపారు

  • అయితే,అమెరికా ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది

  • ఆంగ్ల చానల్‌కు చిదంబరం ఇంటర్వ్యూ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: ముంబై (26/11) ఉగ్రదాడులకుగాను పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుందామనుకున్నాని, అమెరికా వారించడంతో ఆగామని కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం తెలిపారు. ఈ విషయమై తనను, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఒప్పించడానికి అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైజ్‌ భారత్‌కు వచ్చారని పేర్కొన్నారు. పాక్‌పై దాడులు చేయొద్దని ఆమె కోరారని, అలాగే అంతర్జాతీయంగాను తీవ్ర ఒత్తిడి వచ్చిందని ఓ ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం తెలిపారు. 2008 నవంబరు 26న ముంబైలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఉగ్ర దాడుల్లో 175 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన వెంటనే అప్పటి కేంద్ర హోం మంత్రి శివరాజ్‌పాటిల్‌ రాజీనామా చేయగా, చిదంబరం ఆ బాధ్యతలు స్వీకరించారు. ‘‘యుద్ధాన్ని వారించడం కోసం ప్రపంచమంతా ఢిల్లీపై ఆనాడు వాలింది. నేను బాధ్యతలు తీసుకున్న రెండు, మూడు రోజులకు కండోలిజా భారత్‌కు వచ్చి నన్ను, ప్రధానిని కలిశారు. ఆ దాడులపై ప్రతిస్పందించొద్దని ఆమె విజ్ఞప్తి చేయగా, దీనిపై నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని నేను తెలిపారు. ప్రతీకారంగా ఏదో ఒకటి చేయాలని నాకు ఉంది. ఇదే విషయం ప్రధానితోను, తత్సంబంధ వ్యక్తులతోను చర్చించాను. ప్రధాని కూడా సానుకూలంగానే స్పందించారు. పాక్‌పై ఎప్పుడు దాడులు మొదలుపెట్టాలి..ఎలా ముగించాలనేది కూడా ఆయన చర్చించారు. అయితే, విదేశాంగశాఖ, ఐఎ్‌ఫఎస్‌ గట్టిగా పట్టుబట్టడంతో ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది’’ అని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఇప్పుడు వాపోతే ప్రయోజనమేంటి?: బీజేపీ

ముంబై దాడులపై స్పందించడంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం విదేశీ శక్తుల ఒత్తిడికి గురయి, తప్పుగా వ్యవహరించిందని బీజేపీ ఆక్షేపించింది. ‘ఇప్పుడు వాపోతే ప్రయోజనమేంటి’ అంటూ చిదంబరాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 01 , 2025 | 01:52 AM