Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్.. తప్పుడు చర్య
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:20 AM
కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మాజీ ప్రధాని ఇందిరపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె హయాంలో పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్‌ను తప్పుడు చర్యగా అభివర్ణించారు.
తీవ్రవాదుల ఏరివేతకు అది సరైన మార్గం కాదు
కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యలు
సిమ్లా, అక్టోబరు 12: కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మాజీ ప్రధాని ఇందిరపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె హయాంలో పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్‌ను తప్పుడు చర్యగా అభివర్ణించారు. 1984లో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఖలిస్థానీ తీవ్రవాదులను బంధించేందుకు ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట సైనిక చర్య చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, తీవ్రవాదులను ఏరిపారేసేందుకు అది సరైన మార్గం కాదని చిదంబరం అన్నారు. శనివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలో జరిగిన ‘దె విల్ షూట్ యు మేడం: మై లైఫ్ త్రూ కాన్‌ఫ్లిక్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పుస్తక రచయిత హరీందర్ బవేజాతో జరిగిన సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘స్వర్ణ దేవాలంయలో నక్కిన తీవ్రవాదులను బంధించడానికి/ఏరివేతకు సరైన మార్గాలు ఉన్నాయి. కానీ, ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట నిర్వహించిన సైనిక చర్య సరికాదు. ఈ నిర్ణయం తీసుకున్నందకు గాను ఇందిరా గాంధీ మూల్యం చెల్లించుకున్నారు. తన ప్రాణాలే కోల్పోయారు. కానీ, ఆపరేషన్ బ్లూస్టార్ అనేది సైన్యం, నిఘా విభాగం, పోలీస్, రక్షణ శాఖల సమష్టి నిర్ణయం. దానికి ఇందిరను ఒక్కరినే నిందించడం సరికాదు’’ అని కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ‘‘3-4 ఏళ్ల తర్వాత ఆపరేషన్ బ్లాక్ థండర్ పేరిట సైన్యాన్ని ఆలయం వెలుపలే ఉంచి సరైన మార్గంలో స్వర్ణ దేవాలయంలో దాక్కొని ఉన్న తీవ్రవాదులను ఏరిపారేశాం’’ అని చిదంబరం చెప్పారు. స్వర్ణ దేవాలయంలో దాక్కున్న జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలే నేతృత్వంలోని సాయుధ తీవ్రవాదులను ఏరిపారేసేందుకు 1984 జూన్ 1-10 మధ్య ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట సైనిక చర్య చేపట్టారు.
కాంగ్రెస్ కట్టుకథలను బట్టబయలు చేశారు: బీజేపీ
ఆపరేషన్ బ్లూస్టార్‌పై కాంగ్రెస్ కట్టుకథల గుట్టురట్టయిందని బీజేపీ పేర్కొంది. చిదంబరం వ్యాఖ్యలతో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపింది. ఆపరేషన్ బ్లూస్టార్ దేశం కోసం కాదని, రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని ఆరోపించింది. కాంగ్రెస్ చేసిన ఘోర తప్పిదాలను చిదంబరం చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్‌లో పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీసింగ్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వాస్తవాలు కచ్చితంగా చరిత్రలో నమోదవుతాయన్నారు.
సీనియర్లు జాగ్రత్తగా మాట్లాడాలి
చిదంబరం వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సీనియర్ నేతలు బహిరంగ ప్రకటనలు చేసేముందు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. పార్టీ నుంచి అన్ని రకాలుగా లబ్ధి పొందిన సీనియర్లు అప్రమత్తంగా మాట్లాడాలని అధిష్ఠానం పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.