Chennai: నాన్నే నేరస్తుడని నమ్మించేలా అమ్మను చంపేశాడు
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:32 AM
చదువుకోవాలని ఒత్తిడి చేస్తోందని తల్లిని ఓ బాలుడు చంపేయడమే కాకుండా.. ఆ నేరం తండ్రిపైకి వస్తుందని ధీమాగా ఉన్నాడు.
చదువుకోమంటోందని ఓ బాలుడి ఘాతుకం
చెన్నై, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): చదువుకోవాలని ఒత్తిడి చేస్తోందని తల్లిని ఓ బాలుడు చంపేయడమే కాకుండా.. ఆ నేరం తండ్రిపైకి వస్తుందని ధీమాగా ఉన్నాడు. అయితే పోలీసుల విచారణలో దొరికిపోయాడు. తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కీల్‌కుప్పంవేలూరుకు చెందిన లారీ డ్రైవర్ గుణశేఖరన్, మహేశ్వరి (40) దంపతులకు ఓ కుమార్తె, 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు. దీపావళి రోజు భర్త తీసుకొచ్చిన చీరను తీసుకునేందుకు మహేశ్వరి నిరాకరించింది. దీంతో ఆ దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో గుణశేఖరన్ ఆమెపై చేయిచేసుకున్నాడు. అనంతరం మహేశ్వరి ఇంటి నుంచి పొలానికి వెళ్లింది. అదే రోజు సాయంత్రం ఆమె మృతదేహం ఊరి చివరి పొలాల్లో రక్తపు మడుగులో పడి ఉంది. సమాచారం అందుకున్న నావలూరు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముందుగా మహేశ్వరి భర్తను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే లోతైన దర్యాప్తు చేపట్టాక మహేశ్వరి కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానించి బుధవారం అతనిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. చదువుకోవాలంటూ నిత్యం పోరుపెడుతున్న తల్లి పట్ల ఆ బాలుడు ఆగ్రహం పెంచుకుని ఆ ఘాతుకానికి ప్పాలడినట్లు తేలింది. బాలుణ్ణి అరెస్టు చేసిన పోలీసులు గురువారం జువైనల్ హోంకు తరలించారు.