Share News

Union Minister Nitin Gadkari: రాష్ట్రాలకు అత్యాధునిక అంబులెన్సులు

ABN , Publish Date - Dec 18 , 2025 | 02:25 AM

రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవించడంపై విచారం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ... రాష్ట్రాలకు అత్యాధునిక అంబులెన్సులను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని రాజ్యసభలో ప్రకటించారు

Union Minister Nitin Gadkari: రాష్ట్రాలకు అత్యాధునిక అంబులెన్సులు

  • 100 నుంచి 150 వరకూ ఇవ్వడానికి సిద్ధం

  • 10 నిమిషాల్లో ప్రమాద స్థలానికి చేరాలి

  • రాజ్యసభలో కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ, డిసెంబరు 17: రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవించడంపై విచారం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ... రాష్ట్రాలకు అత్యాధునిక అంబులెన్సులను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని రాజ్యసభలో ప్రకటించారు. అయితే అవి ప్రమాద స్థలానికి 10 నిమిషాల్లో చేరాలన్నదే తమ షరతని పేర్కొన్నారు. ఐఐఎం అధ్యయనం మేరకు ప్రమాద ఘటనా స్థలానికి అంబులెన్సు 10 నిమిషాల్లో చేరితే కనీసం 50వేల మందిని రక్షించగలిగే అవకాశం ఉండేదన్న విషయాన్ని గడ్కరీ అంగీకరిస్తూ... ‘‘ప్రమాద బాధితులను రక్షించే వారిని ‘రహ్‌వీర్‌’ పేరుతో గౌరవించాలని, వారికి రూ.25 వేలు ప్రోత్సాహక బహుమతిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంబులెన్సులను నడపడం జాతీయ రహదారుల బాధ్యత కాదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలతో కిలోమీటర్ల పద్ధతిలో అంబులెన్సులను నడపడానికి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాం. కేంద్రం వారికి 100-150 అత్యాధునిక అంబులెన్సులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది’’ అని స్పష్టం చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా 2026 చివరి నాటికి మల్టీ లేన్‌ ఫ్రీ ఫ్లో, ఏఐ ఆధారిత జాతీయ రహదారి యాజమాన్య పద్ధతులను ప్రవేశపెట్టనున్నట్లు గడ్కరీ తెలిపారు. ‘ఇది అమలులోకి వస్తే టోల్‌ గేట్ల వద్ద క్షణం కూడా ఆగాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.6వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది’ అన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 02:25 AM