India protests: 50 ఏళ్ల నిరసనలపై అధ్యయనం
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:12 AM
స్వాతంత్ర్యానంతరం భారత్‌లో చేపట్టిన నిరసనలపై, ముఖ్యంగా 1974 తర్వాత జరిగిన సామూహిక ఆందోళనలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా నిరసనలు...
ఉద్యమాలకు కారణాలు, ఆర్థిక అంశాలు, డిమాండ్లు
తెరవెనుక సూత్రధారులు, తుది ఫలితంపై సమగ్ర విశ్లేషణ
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు
భవిష్యత్తులో ఆందోళనలను నిరోధించడానికి కార్యాచరణ
న్యూఢిల్లీ, డిసెంబరు 28: స్వాతంత్ర్యానంతరం భారత్‌లో చేపట్టిన నిరసనలపై, ముఖ్యంగా 1974 తర్వాత జరిగిన సామూహిక ఆందోళనలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా నిరసనలు, ఆందోళనలకు గల మూల కారణాలు, ఆర్థిక అంశాలు, తెరవెనుక ఉన్న సూత్రధారులు, నిరసనల తుది ఫలితాలను విశ్లేషించి.. భవిష్యత్తులో స్వార్థ శక్తులు ప్రేరేపించే ఉద్యమాలను అణచివేసేందుకు ఒక సమగ్ర కార్యాచరణను రూపొందించనుంది. గత 50 ఏళ్లలో దేశంలో జరిగిన నిరసనలపై ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్‌వోపీ) సిద్ధం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నాలుగు నెలల క్రితం బ్యూరో ఆఫ్ పోలీస్ అండ్ డెవల్‌పమెంట్ (బీపీఆర్ అండ్ డీ)ని ఆదేశించారు. ఈ క్రమంలో గత ఐదు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా జరిగిన ప్రధాన నిరసనలకు సంబంధించిన వివరణాత్మక రికార్డులు అందించాలని బీపీఆర్ అండ్ డీకి చెందిన నేషనల్ పోలీస్ మిషన్ (ఎన్‌పీఎం) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులను కోరింది. ఇటీవల డీజీపీలకు పంపిన లేఖలో.. అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు తమతమ రాష్ట్రాల్లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన అన్ని రకాల నిరసనల వివరాలను అందించాలని, ఆ సమాచారాన్ని ఎన్‌ఐసీ లింక్ ద్వారా పంపాలని కోరింది. ఉద్యమాల స్వభావాన్ని తెలుసుకునేందుకు వీలుగా హోంశాఖ ఆధ్వర్యంలోని పోలీస్ థింక్ ట్యాంక్ 13 ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నావళిని రూపొందించింది. పలానా ఉద్యమం లేదా నిరసన ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది..? వాటికి మూలం ఏమిటి..? తెరవెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరు..? దాని ప్రధాన ఉద్దేశం ఏమిటి..? నిరసనల్లో ఎంతమంది పాల్గొన్నారు..? ఎంతకాలంపాటు సాగింది..? ఈ సందర్భంగా ఏమైనా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయా..? ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లు ఏమిటి..? చివరకు ఉద్యమ ఫలితం ఏమిటి..? విజయం సాధించిందా లేదా..? ప్రాణనష్టం ఏమైనా జరిగిందా..? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు..? ప్రజా ఆస్తులకు ఏమైనా నష్టం వాటిల్లిందా..? వంటి విషయాలతో కూడిన వివరణాత్మక నివేదిక అందించాలని అందులో పేర్కొంది. ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాల ఆధారంగా.. భవిష్యత్తులో స్వార్థ శక్తులు ప్రేరేపించే సామూహిక ఆందోళనలను నిరోధించడానికి ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించడానికి అవకాశం ఉంటుంది.