Central Govt: నూతన సీజేఐ ఎంపిక ప్రక్రియ ఆరంభం
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:21 AM
సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామక ప్రక్రియను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
వారసుడి పేరు సూచించాలని జస్టిస్ గవాయ్‌కు కేంద్రం లేఖ
జస్టిస్ సూర్యకాంత్‌కు అవకాశం?
న్యూఢిల్లీ, అక్టోబరు 23: సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామక ప్రక్రియను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనుండడంతో కొత్తవారిని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. వారసుడి పేరును సూచించాల్సిందిగా కోరుతూ జస్టిస్ గవాయ్‌కు లేఖ రాసింది. 65 ఏళ్ల వయసు వచ్చిన వెంటనే ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. దానిని పరిగణనలోకి తీసుకొని పదవీ విరమణకు నెల రోజులు ముందుగా కేంద్రం లేఖ రాయడం సంప్రదాయంగా వస్తోంది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి తరువాత అత్యంత సీనియర్ అయిన జడ్జిని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించే ఆచారం ఉండడంతో ఆ అవకాశం జస్టిస్ సూర్యకాంత్‌కు దక్కే సూచనలు ఉన్నాయి. ఒకవేళ జస్టిస్ సూర్యకాంత్ నియమితులైతే ఆయన 15 నెలలపాటు అంటే నవంబరు 24 నుంచి 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు పదవిలో కొనసాగనున్నారు.