Share News

Centre Condemns Red Fort Blast: బాంబు పేలుడు ఉగ్ర ఘాతుకమే

ABN , Publish Date - Nov 13 , 2025 | 04:12 AM

లాల్‌ఖిలా వద్ద కారు బాంబు పేలుడును కేంద్ర ప్రభుత్వం దారుణమైన ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. దేశవ్యతిరేక శక్తులు పక్కాప్రణాళిక ప్రకారం ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని మండిపడింది....

Centre Condemns Red Fort Blast: బాంబు పేలుడు ఉగ్ర ఘాతుకమే

  • దేశవ్యతిరేక శక్తులు పక్కా ప్రణాళికతో ఈ ఘోరానికి పాల్పడ్డాయి.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

  • ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ తీర్మానం

న్యూఢిల్లీ, నవంబరు 12: లాల్‌ఖిలా వద్ద కారు బాంబు పేలుడును కేంద్ర ప్రభుత్వం దారుణమైన ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. దేశవ్యతిరేక శక్తులు పక్కాప్రణాళిక ప్రకారం ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని మండిపడింది. ఈ కేసును వేగంగా దర్యాప్తు చేసి.. ఈ ఘోరానికి కారకులైనవారిని, వారి వెనుక ఉన్నవారిని చట్టం ముందుకు వీలైనంత త్వరగా తీసుకురావాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. ప్రభుత్వంలోని అత్యున్నతవర్గాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటాయని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం ఇక్కడ సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌.. ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న దుర్మార్గమైన, పిరికిపంద ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమన్న విధానానికి భారత్‌ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించింది. ఈ ఉగ్ర ఘాతుకానికి బలైన అమాయకులకు నివాళిగా క్యాబినెట్‌ రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ పేలుడులో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది. దేశంలోని ప్రతి పౌరుడి ప్రాణాలను కాపాడేందుకు, దేశ భద్రతను, దేశ సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించింది. క్యాబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం.. ఆ విశేషాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విలేకరులకు వెల్లడించారు. ఈ ఉగ్రదాడిని యుద్ధచర్యగా (యాక్ట్‌ ఆఫ్‌ వార్‌) పరిగణిస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘నేను ఇప్పటికే మంత్రి వర్గం ఆమోదించిన తీర్మానాన్ని చదివి వినిపించాను’ అని బదులిచ్చారు. కాగా, ఈ భేటీకి ముందు ప్రధాని నరేంద్ర మోదీ.. ‘భద్రతపై క్యాబినెట్‌ కమిటీ’ భేటీని నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌ షా తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు.


మరికొన్ని కీలక నిర్ణయాలు..

ఎర్రకోట వద్ద ఉగ్రదాడిని ఖండిస్తూ తీర్మానం చేయడంతోపాటు.. కేంద్ర క్యాబినెట్‌ కొన్ని కలీక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దేశ ఎగుమతి వ్యవస్థ బలోపేతానికిగాను 2025-26 నుంచి 2030-31 వరకూ రూ.25,060 కోట్లతో ప్రతిపాదించిన ‘ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌(ఈపీఎం)’కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్‌లో అంతర్భాగంగా రెండు ఉప పథకాలు ఉంటాయి. ఒకటి.. నిర్యత్‌ ప్రోత్సాహన్‌. మరొకటి నిర్యత్‌ దిశ. వీటిలో నిర్యత్‌ ప్రోత్సాహన్‌ కింద దేశంలోని ఎంఎ్‌సఎంఈలకు రుణసౌలభ్యం, ఈకామర్స్‌ ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ వంటివి కల్పిస్తారు. ఇందుకుగాను ఈ పథకానికి రూ.10,401 కోట్లు కేటాయించారు. రూ.14,659 కోట్లతో చేపట్టనున్న నిర్యత్‌ దిశ పథకంలో భాగంగా ఎగుమతి నాణ్యత, అంతర్జాతీయ బ్రాండింగ్‌, ప్యాకేజింగ్‌, రవాణా సదుపాయాలు, ఆర్థికేతర సదుపాయాల కల్పన తదితరాలపై దృష్టి సారిస్తారు. అలాగే.. రూ.20 వేల కోట్లతో.. ఎగుమతిదారులకు పూచీకత్తు లేని రుణసాయం కల్పించే సీజీఎ్‌సఈ పథకానికికూడా కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ‘నేషనల్‌ క్రెడిట్‌ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌సీజీటీసీ) ద్వారా ఎగుమతిదారులకు 100 శాతం రుణ భరోసా కవరేజీని కల్పించనున్నారు. దీంతోపాటు.. గ్రాఫైట్‌, సీజియం, రుబీడియం, జిర్కోనియం దేశీయ ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా వాటి రాయల్టీ రేట్లను హేతుబద్ధీకరణకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Updated Date - Nov 13 , 2025 | 04:12 AM