Rammohan Naidu: కొత్తగా మరో 3ఎయిర్‌లైన్స్
ABN , Publish Date - Dec 25 , 2025 | 04:02 AM
దేశ విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించేందుకు వీలుగా కొత్తగా రెండు విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది....
తాజాగా అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్‌ప్రెస్ సంస్థలకు అనుమతులు ఇచ్చిన కేంద్రం
ఇటీవలే శంఖ్ ఎయిర్‌లైన్స్‌కు ఎన్‌వోసీ
న్యూఢిల్లీ, డిసెంబరు 24: దేశ విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించేందుకు వీలుగా కొత్తగా రెండు విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్‌ప్రెస్ సంస్థలు దేశంలో విమాన సర్వీసులు నిర్వహించేందుకు వీలుగా పౌర విమానయాన శాఖ ‘ఎన్‌వోసీ’లు జారీ చేసింది. వీటికితోడు ఇటీవలే శంఖ్ ఎయిర్‌లైన్స్‌కు కూడా అనుమతులు వచ్చాయి. దీనితో వాణిజ్యపరంగా విమాన సర్వీసులు నిర్వహించేందుకు ఈ మూడు సంస్థలకు మార్గం సుగమమైంది. ఇటీవల ఇండిగో వందలాది విమాన సర్వీసులను రద్దు చేయడంతో లక్షలాది మంది విమాన ప్రయాణికులు ఇబ్బందిపడిన విషయం తెలిసిందే. విమానయాన రంగంలో కేవలం రెండు సంస్థలకే ఇండిగో (65ు), ఎయిరిండియా (సుమారు 20ు) గుత్తాధిపత్యం ఉండటమే ఈ సంక్షోభానికి కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కొత్త సంస్థలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. కేరళకు చెందిన అల్ హింద్ గ్రూపు అల్‌హింద్ ఎయిర్ సంస్థను ఏర్పాటు చేసింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రాంతీయ సర్వీసులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక హైదరాబాద్‌కు చెందిన ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థ ఇప్పటికే కొరియర్, సరుకు రవాణా సేవల్లో ఉంది. ఇప్పుడు ప్రయాణికుల విభాగంలోకి వస్తోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌కు చెందిన శంఖ్ ఎయిర్ సంస్థ యూపీతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాంతీయ సర్వీసులు నిర్వహించేందుకు సిద్ధమైంది. కొత్త ఎయిర్‌లైన్స్‌కు అనుమతులపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్‌ప్రెస్, శంఖ్ ఎయిర్ సంస్థల ప్రతినిధులతో గత వారం రోజులుగా సమావేశాలు జరపడం సంతోషకరం. శంఖ్ ఎయిర్ ఇప్పటికే ఎన్‌వోసీ పొందగా, తాజాగా అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థలు ఎన్‌వోసీ పొందాయి. మోదీ ప్రభుత్వ విధానాల ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటిగా భారత్ మారింది. దేశంలో ప్రాంతీయంగా విమాన అనుసంధానాన్ని పెంచేందుకు చేపట్టిన ఉడాన్ వంటి పథకాలతో స్టార్ ఎయిర్, ఇండియా వన్ ఎయిర్, ఫ్లై 91 వంటి సంస్థలు కీలక భూమిక పోషిస్తున్నాయి. దేశంలో విమానయాన రంగంలో వృద్ధికి భారీ స్థాయిలో అవకాశాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.