వాంగ్‌చుక్ సంస్థకు విదేశీ నిధులు కట్
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:57 AM
లద్దాఖ్‌లో బుధవారం చెలరేగిన హింసకు కారణం విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుకేనని ఆరోపించిన కేంద్ర హోం శాఖ.. ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. ఆయన స్థాపించిన ‘లద్దాఖ్ విద్యా సాంస్కృతిక ఉద్యమం’ అనే
వాంగ్‌చుక్ సంస్థకు విదేశీ నిధులు కట్!
ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును రద్దు చేసిన కేంద్రం
లద్దాఖ్‌లో హింసకు ఆయనే కారణమని ప్రకటించిన మరుసటి రోజే కీలక నిర్ణయం
లేహ్, సెప్టెంబరు 25: లద్దాఖ్‌లో బుధవారం చెలరేగిన హింసకు కారణం విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుకేనని ఆరోపించిన కేంద్ర హోం శాఖ.. ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. ఆయన స్థాపించిన ‘లద్దాఖ్ విద్యా సాంస్కృతిక ఉద్యమం’ అనే సంస్థకు విదేశీ నిధులు అందకుండా బ్రేక్ వేసింది. ఆ సంస్థకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద జారీ చేసిన లైసెన్సును గురువారం రద్దు చేసింది. ఆ సంస్థ పలుమార్లు ఎఫ్‌సీఆర్‌ఏను ఉల్లంఘించినట్లు గుర్తించామని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. కొంతకాలంగా వాంగ్‌చుక్ సంస్థ ఆర్థిక లావాదేవీలపై సీబీఐ విచారణ జరుపుతున్నా ఇంతవరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. అయితే లద్దాఖ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న మరుసటి రోజే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర హోదా కోసం నిరసనలు హింసాత్మకంగా మారిన లద్ధాఖ్‌లో గురువారం కర్ఫ్యూ విధించారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న 50 మందిని అరెస్టు చేశారు. కాగా, తాను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశానని, అందుకే లద్దాఖ్‌లో హింస చెలరేగిందన్న కేంద్ర హోం శాఖ అభియోగాన్ని వాంగ్‌చుక్ ఖండించారు. కేంద్రం సమస్య నుంచి తప్పించుకోవడానికి తనను బలిపశువును చేస్తోందని ఆరోపించారు. ప్రజా భద్రత చట్టం కింద తనను రెండేళ్లు జైలులో పడేయడానికి పథకం రచిస్తోందని ఆరోపించారు. తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనన్నారు. తాను స్వేచ్ఛగా ఉన్నప్పు డు కంటే జైలులో ఉన్నప్పుడే ప్రభుత్వానికి సమస్యలు పెరుగుతాయన్నారు. తాము విదేశీ విరాళాలపై ఆధారపడలేదని ఆయన పేర్కొన్నారు.