Share News

Road Accident: యాక్సిడెంట్‌ బాధితులకు రూ.1.50లక్షల వరకు వైద్యం ఫ్రీ

ABN , Publish Date - Jun 07 , 2025 | 05:57 AM

రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి రూ.1.50లక్షల నగదురహిత(క్యాష్‌ లెస్‌) చికిత్స అందించడానికి వీలుగా కేంద్రప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Road Accident: యాక్సిడెంట్‌ బాధితులకు రూ.1.50లక్షల వరకు వైద్యం ఫ్రీ

  • ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా ఆస్పత్రిలో చేరినవారు అర్హులు

  • ఆయుష్మాన్‌ భారత్‌ వర్తించే ఆస్పత్రులన్నింటిలో పథకం అమలు

న్యూఢిల్లీ, జూన్‌ 6: రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి రూ.1.50లక్షల నగదురహిత(క్యాష్‌ లెస్‌) చికిత్స అందించడానికి వీలుగా కేంద్రప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్‌ 162కింద ఈ గెజిట్‌ను విడుదల చేసింది. ప్రమాదం జరిగిన 24గంటల్లోగా ఆసుపత్రిలో చేరినవారు ఈ పథకానికి అర్హులు. అయితే, ప్రమాదం నిజమా.. కాదా.. అన్నది స్థానిక పోలీసులు యాక్సిడెంట్‌ జరిగిన 24గంటల్లోగా గుర్తించి ఆసుపత్రికి తెలియజేయాలి. లేకపోతే, కవరేజీ లభించదు. ఒకవేళ బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే మాత్రం చికిత్స అందిస్తారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఈ పథకం కింద నగదు రహితంగా ఏడు రోజుల వరకు చికిత్స అందజేస్తారు.


ఆయుష్మాన్‌ భారత్‌ పీఎం-జన్‌ ఆరోగ్య యోజన అమలయ్యే, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏ) నోటిఫై చేసిన ఆసుపత్రుల్లో ఈ పథకం అమలు అవుతుంది. ఒకవేళ బాధితులను యాక్సిడెంట్‌ ప్రదేశం నుంచి సమీపంలోని వేరే ఆస్పత్రులకు తరలిస్తే.. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఆ తర్వాత.. ఈ పథకం అమలయ్యే ఆసుపత్రులకు పంపించవచ్చు. రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించే ఆసుపత్రులు ఆ వివరాలను ఆయా స్టేట్‌ హెల్త్‌ ఏజెన్సీ(ఎ్‌సహెచ్‌ఏ)ల ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. కాగా, యాక్సిడెంట్‌ గురించి సమాచారం ఇవ్వాలనుకున్నవారు 112 నంబర్‌కు కాల్‌ చేయాలి. లేకపోతే ఈడీఏఆర్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా సమాచారం ఇవ్వొచ్చు. చికిత్స సయమంలో బాధితుడు చనిపోతే హాస్పిటల్‌కు రీయింబర్స్‌మెంట్‌ వస్తుంది.

Updated Date - Jun 07 , 2025 | 05:57 AM