GST Reduction: పాత స్టాకుపై కొత్త ధరలతో స్టిక్కర్లు
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:30 AM
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం ప్రజలకు పక్కాగా అందించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. పాత స్టాకు మీద ముద్రించి ఉన్న గరిష్ట చిల్లర ధర ...
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం ప్రజలకు అందేలా కేంద్రం వెసులుబాటు..మారిన పన్ను మేరకే కొత్త ఎమ్మార్పీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం ప్రజలకు పక్కాగా అందించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. పాత స్టాకు మీద ముద్రించి ఉన్న గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)ను మార్చుకునేందుకు కంపెనీలకు వెసులుబాటు కల్పిస్తూ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. సాధారణంగా కంపెనీలు ఏవైనా వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్‌లోకి విడుదల చేశాక.. వాటిపై ఉన్న ఎమ్మార్పీని మార్చేందుకు అవకాశం ఉండదు. కానీ ఈ నెల 22 తర్వాత జీఎస్టీ శ్లాబుల మార్పు, పన్ను తగ్గింపు అమల్లోకి వస్తుండటంతో.. ఆ రోజు నాటికి ఇంకా నిల్వ ఉన్న పాత స్టాకుపై కొత్త ధరలతో స్టిక్కర్లు వేయడానికి ప్రభుత్వం అనుమతించింది. కేవలం పన్నుల్లో మార్పుల మేరకు మాత్రమే ధరల సవరణ ఉండాలని, ఇతర మార్పులేమీ ఉండొద్దని పేర్కొంది. అంతేగాక ఉత్పత్తులపై పాత ఎమ్మార్పీ కూడా కనిపించేలా ఉండాలని స్పష్టం చేసింది. ఽఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు, లేదా పాత స్టాక్ అయిపోయే వరకు మాత్రమే ఇలా ధరల మార్పు స్టిక్కర్లను వేసే వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, జీఎస్టీ పన్ను తగ్గింపు అమలులో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ‘ఎక్స్’లో తెలిపారు.
మరిన్ని వాహన కంపెనీల ధరల తగ్గింపు ప్రకటన
జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో.. తమ వాహనాల ధరలు ఎంతవరకు తగ్గుతాయన్న దానిపై మరిన్న వాహన తయారీ కంపెనీలు ప్రకటనలు జారీ చేశాయి. ద్విచక్ర వాహనాల సంస్థలు యమహా తమ వాహనాలపై రూ.17,581 వరకు.. బజాజ్ రూ.20 వేలవరకు తగ్గింపు ఉంటుందని తెలిపాయి. మోడళ్లు, వేరియంట్లను బట్టి తమ కార్ల ధరలు రూ.57 వేల నుంచి రూ.95వేల వరకు తగ్గుతున్నట్టు హోండా కార్ల కంపెనీ వెల్లడించింది. ఇక టాటా అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) తమ వాహనాల ధరలు రూ.4.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు.. వోల్వో సంస్థ తమ కార్ల ధరలు రూ.6.9 లక్షల వరకు తగ్గుతున్నట్టు ప్రకటించాయి.