Election Commission of India: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర పరిశీలకులు!
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:07 AM
తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) దృష్టి సారించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో...
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికలపై ఈసీ దృష్టి
ఎన్నికల పరిశీలనకు 470 మంది అధికారులు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) దృష్టి సారించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. బిహార్‌తో పాటు జూబ్లీహిల్స్, ఖాళీగా ఉన్న మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలకు కేంద్ర పరిశీలకులను నియమిస్తున్నట్లు ఈసీ ఆదివారం ప్రకటించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకే పరిశీలకులను నియమిస్తున్నట్లు వెల్లడించింది. బిహార్ శాసనసభ ఎన్నికలు; మరికొన్ని రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలను పర్యవేక్షించేందుకు దేశవ్యాప్తంగా వివిధ సర్వీసులకు చెందిన 470 మంది సీనియర్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపింది. వీరు ప్రధానంగా అభ్యర్థులు చేసే ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక నిఘా పెడతారు. బిహార్ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్; జమ్మూకశ్మీరులోని బుద్గాం, నౌగ్రోటా; రాజస్థాన్‌లోని అంటా; ఝార్ఖండ్‌లోని ఘాట్‌శిల; పంజాబ్‌లోని తరన్ తారన్; మిజోరంలోని దంప; ఒడిసాలోని నువాపడ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో ఈ పరిశీలకులు విధులు నిర్వహిస్తారని ఈసీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. ‘మిషన్ బిహార్ విజయం’ కోసం కొందరు కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 45 మంది ఎంపీలు, సీనియర్ నేతలను నియమించింది. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో ఒక్కో సీటును వారికి అప్పగించారు. ప్రతి నాయకుడు ఆరేసి అసెంబ్లీ సెగ్మెంట్లను పర్యవేక్షిస్తారు.