Share News

Central Government: విమాన టికెట్‌ ధరలకు కళ్లెం

ABN , Publish Date - Dec 07 , 2025 | 06:11 AM

ఇండిగో సంక్షోభం, వందలాది విమానాల రద్దుతో ఇతర విమానయాన సంస్థలు భారీగా చార్జీలు పెంచేయడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

Central Government: విమాన టికెట్‌ ధరలకు కళ్లెం

  • గరిష్ఠ ధరలపై నియంత్రణ విధించిన కేంద్రం

  • 500 కి.మీ. లోపు 7,500; వెయ్యి కి.మీ. లోపు రూ.12వేలు

  • ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఇతర సంస్థలు

  • భారీగా చార్జీలు పెంచడంతో చర్యలు

  • ప్రయాణికులకు రీఫండ్‌ ఇవ్వాలని ఇండిగోకు కేంద్రం ఆదేశం

  • తాజాగా 800 ఇండిగో సర్వీసుల రద్దు.. రైళ్లకు పెరిగిన రద్దీ

  • ఇండిగో సీఈవోకు డీజీసీఏ షోకాజ్‌ నోటీసుల జారీ

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/బెంగళూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఇండిగో సంక్షోభం, వందలాది విమానాల రద్దుతో ఇతర విమానయాన సంస్థలు భారీగా చార్జీలు పెంచేయడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎకానమీ తరగతిలో దేశీయ ప్రయాణాలకు దూరాన్ని బట్టి గరిష్ఠ చార్జీలపై నియంత్రణ విధించింది. భారీస్థాయిలో విమానాల రద్దు, ఒక్కసారిగా పెరిగిన చార్జీలతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారని పేర్కొంది. ఈ క్రమంలో ప్రజా ప్రయోజనం కోసం చార్జీలపై నియంత్రణ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. విమానయాన సంస్థలు అంతరాయాల సమయంలో అసాధారణంగా చార్జీలు పెంచేయడం అవకాశవాదమని, దీనిని సీరియ్‌సగా తీసుకుంటున్నామని పేర్కొంది. చార్జీలు సాధారణ స్థితికి వచ్చే వరకు లేదా తిరిగి సమీక్షించి నిర్ణయించే వరకు ఈ నియంత్రణలు అమల్లో ఉంటాయని.. అన్ని విమానయాన సంస్థలు తప్పనిసరిగా ఈ పరిమితులను పాటించాలని స్పష్టం చేసింది. ఆదేశాలను ఉల్లంఘించే సంస్థలపై వెంటనే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. అయుతే ఈ ధరలు బిజినెస్‌ క్లాస్‌, ఉడాన్‌ సీట్లకు వర్తించవు. ఇండిగో విమానాల రద్దుతో ఎయిరిండియా, స్పైస్‌జెట్‌ సంస్థల చార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అప్పటికప్పుడు కొనుగోలు చేసే టికెట్ల ధరలను చూస్తే.. సాధారణ సమయంలో హైదరాబాద్‌-ముంబై (630 కి.మీ) విమాన చార్జీ రూ.20వేల వరకు ఉంటే.. ఇప్పుడు రూ.70వేలకుపైగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌-ఢిల్లీ (1,300 కి.మీ) ప్రయాణానికి రూ.90 వేలకుపైన తీసుకుంటున్నారు.


మరో 800కుపైగా విమాన సర్వీసులు రద్దు

ఇండిగో శనివారం దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల నుంచి నడిచే 800కుపైగా సర్వీసులను రద్దు చేసింది. అందులో బెంగళూరు నుంచి 124 సర్వీసులు, ముంబై నుంచి 109, ఢిల్లీ నుంచి 106, హైదరాబాద్‌ నుంచి 144 సర్వీసులు ఉన్నట్టు విమానయాన వర్గాలు తెలిపాయి. ఇండిగో రోజూ సుమారు 2,300 సర్వీసులు నిర్వహిస్తుంది. శుక్రవారం కేవలం 700 సర్వీసులు మాత్రమే నిర్వహించి, 1,600కిపైగా సర్వీసులను రద్దు చేసింది. పైలట్లకు ఫ్లైట్‌డ్యూటీ, విశ్రాంతికి సంబంధించిన రెండో దశ నిబంధనల (ఎఫ్‌డీటీఎల్‌) అమలు నుంచి ప్రభుత్వం ఇండిగోకు తాత్కాలికంగా వెసులుబాటు ఇవ్వడంతో.. శనివారం విమానాల రద్దు సంఖ్య తగ్గింది. అయితే, ఈ వెసులుబాటుపై ఎయిర్‌లైన్‌ పైలట్స్‌ అసోసియేషన్‌(ఆల్ఫా) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది లక్షలాది మంది ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతుందని పేర్కొంది. ఈ క్రమంలో ‘ఎఫ్‌డీటీఎల్‌’ నిబంధనల నుంచి ఇచ్చిన ఉపశమనం పరిమితం, తాత్కాలికమేనని.. ఇది ఇండిగో ఏ320 విమానాలకు మాత్రమే వర్తిస్తుందని పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో అలజడి నెలకొంది. వేలాది మంది ప్రయాణికులతోపాటు ఎక్కడ చూసినా లగేజీ బ్యాగులే కనిపిస్తున్నాయి. పలుచోట్ల ప్రయాణికులు ఇండితో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. ఇక, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు కూడా అడ్డగోలుగా చార్జీలు పెంచాయి. రూ.1,500 లోపు ఉండే చార్జీని.. రూ.5వేల దాక వసూలు చేస్తున్నారు.


ఇండిగో సీఈవోకు షోకాజ్‌ నోటీసులు

విమానాలు రద్దయిన ప్రయాణికులకు టికెట్‌ చార్జీల రీఫండ్‌ను ఆదివారం రాత్రి 8 గంటలకల్లా పూర్తి చేయాలని ఇండిగోను పౌర విమానయాన శాఖ ఆదేశించింది. ఒకవేళ సదరు ప్రయాణికులు రీషెడ్యూల్‌ చేసుకుంటే ఎలాంటి చార్జీలు విధించవద్దని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రయాణికుల లగేజీని 48గంటల్లో వారికి అప్పగించాలని ఆదేశించింది. కాగా, విమానయాన సంక్షోభం నేపథ్యంలో ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్‌కు డీజీసీఏ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ప్రణాళిక మేరకు విమాన సర్వీసుల నిర్వహణలో ఇండిగో పూర్తిస్థాయిలో విఫలమైందని, దీనిపై 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఎకానమీ క్లాస్‌లో దేశీయ ప్రయాణాలకు ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ఠ విమాన చార్జీలు

  • 500 కి.మీ. దూరం వరకు రూ.7,500

  • 500-1000 కి.మీ. మధ్య రూ.12 వేలు

  • 1000-1,500 కి.మీ. మధ్య రూ.15 వేలు

  • 1,500 కి.మీ. దూరం దాటితే రూ.18 వేలు

Updated Date - Dec 07 , 2025 | 06:13 AM