PM Modi: రైల్వే ఉద్యోగులకు బోనస్
ABN , Publish Date - Sep 25 , 2025 | 03:59 AM
రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోన్‌సను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇది ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 వరకు ఉంటుందని తెలిపింది....
ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951
10.91 లక్షల మందికి ప్రయోజనం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోన్‌సను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇది ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 వరకు ఉంటుందని తెలిపింది. దీనివల్ల 10,91,146 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ.. రైల్వే ఉద్యోగుల బోన్‌సకు ఆమోదముద్ర వేసింది. ఏటా దసరా పండగ వేళ ఉత్పాదకత ఆధారిత బోన్‌సను రైల్వే ఉద్యోగులకు కేంద్రం ప్రకటిస్తోంది. 2024-25లో రైల్వే ఉద్యోగుల పనితీరు చాలా బాగుందని, 1614.9 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరిగిందని, 730 కోట్ల మంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణించారని ఒక ప్రకటనలో కేంద్రం తెలిపింది. సముద్ర వాణిజ్యరంగానికి పెద్ద పీట వేస్తూ నౌకల తయారీ, మౌలిక సదుపాయాల పెంపుదలకు రూ.69,725 కోట్ల భారీ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ అంగీకరించింది. దీనివల్ల 45 లక్షల టన్నుల నౌకా నిర్మాణ సామర్థ్యం సమకూరుతుందని, ఈ రంగంలోకి రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడులు తరలివస్తాయని, ఫలితంగా కొత్తగా దాదాపు 30 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు, దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషి్‌పలకు రూ.2,277 కోట్లను కేటాయించే పథకానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎన్నికలు జరగనున్న బిహార్‌లో రూ.2,192 కోట్ల వ్యయంతో 104 కి.మీ.ల సింగిల్ రైల్వే ట్రాక్‌ను డబ్లింగ్ చేసే ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఆ రాష్ట్రంలో రహదారుల విస్తరణకు రూ.3,822 కోట్ల మొత్తాన్ని కేటాయించింది.