Maoists: దండకారణ్యానికి భారీగా బలగాలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 02:56 AM
మధ్యభారతంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న కేంద్ర బలగాలు నిర్ణయాత్మక దాడులకు సిద్ధమవుతున్నాయి. నక్సల్స్ కదలికలు ఉన్న...
కశ్మీర్ నుంచి తరలింపు.. మావోయిస్టుల అగ్ర నాయకత్వం అంతమే లక్ష్యం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: మధ్యభారతంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న కేంద్ర బలగాలు నిర్ణయాత్మక దాడులకు సిద్ధమవుతున్నాయి. నక్సల్స్ కదలికలు ఉన్న ఛత్తీ్‌సగఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు మరిన్ని బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా అమర్‌నాథ్ యాత్ర కోసం జమ్మూకశ్మీర్‌లో నియమించిన కేంద్ర పోలీస్ సాయుధ బలగాల్లో (సీఏపీఎఫ్) ఇంకా అక్కడే ఉండిపోయిన వారిలో 80ు మేర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు తరలించనున్నారు. ఈ విషయాన్ని సీఏపీఎ్‌ఫలోని సీనియర్ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. మావోయిస్టు నాయకత్వాన్ని భౌతికంగా బలహీనపరచడం...ఇప్పటికీ వారి చేతుల్లోని ప్రాంతాలను ఒక్కొక్కటిగా స్వాధీనంలోకి తెచ్చుకోవడం లక్ష్యంగా అదనపు బలగాలను కేటాయిస్తున్నట్టు తెలిపాయి. రాబోయే కొన్ని వారాల్లో అవి ఎర్ర బీభత్స ప్రాంతాలకు (రెడ్‌జోన్) చేరుకుంటాయని తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల రహిత భారత్‌ను నిర్మిస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన నాయకత్వాన్ని బలహీనపరిచేందుకుగాను కేంద్ర కమిటీ సభ్యులపై గురిపెట్టి కేంద్ర బలగాలు దాడులు సాగిస్తున్నాయి. తాజాగా ఒకే ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి (రాజుదాదా), కడారి సత్యనారాయణరెడ్డి (కోసా) మృతిచెందారు. ఈ ఏడాదిలో దాదాపు ఎనిమిదిమంది సీసీ సభ్యులను ఎన్‌కౌంటర్ చేశారు. ఒక సీసీ మెంబరు లొంగిపోయారు. నాయకుల్లో అధిక భాగం ఛత్తీ్‌సగఢ్, జార్ఖండ్, ఒడిశాల్లో తలదాచుకున్నట్టు కేంద్ర హోంశాఖ వద్ద సమాచారం ఉంది. ఈక్రమంలో ఈ మూడు రాష్ట్రాలపైనే దృష్టి పెట్టి.. అదనపు బలగాలను అక్కడకు అధికంగా తరలించాలని నిర్ణయించింది.
కాల్పులవిరమణ.. ఓ ఎత్తుగడ
మావోయిస్టులు చేస్తున్న కాల్పుల విరమణ ప్రతిపాదనను కేంద్ర బలగాలు తిరస్కరించాయి. బలగాల దృష్టిని మళ్లించడం కోసం ఒక ఎత్తుగడగా ఈ ప్రతిపాదన చేస్తున్నారని పెదవి విరిశాయి. ఇటువంటి ప్రతిపాదనలతో మావోయిస్టులు ముందుకురావడం కొత్తకాదని, వాటికి పెద్దగా సాధికారికత కూడా లేదని కేంద్ర హోంశాఖలోని సీనియర్ అధికార వర్గాలు తెలిపాయి. సీనియర్ నాయకులు చనిపోతుండటంతో ఇప్పటికే ఆత్మరక్షణలో పడిపోయిన మావోయిస్టులు ఇలాంటి ఎత్తుగడలు పన్నుతున్నారని ఈ వర్గాలు తెలిపాయి. దండకారణ్య కమిటీ, కేంద్ర కమిటీలో ఇంకా మిగిలిన నాయకుల పని కూడా పడతామని స్పష్టం చేశాయి.