General Anil Chauhan: నిన్నటి ఆయుధాలతో.. నేటి యుద్ధం గెలవలేం!
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:58 AM
భారత రక్షణ సామర్థ్యాన్ని తక్షణమే ఆధునీకరించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు.
దేశ రక్షణ సామర్థ్యాన్ని తక్షణం ఆధునీకరించాల్సి ఉంది
సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
న్యూఢిల్లీ, జూలై 16: భారత రక్షణ సామర్థ్యాన్ని తక్షణమే ఆధునీకరించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ‘‘నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధం గెలవలేం. రేపటి సాంకేతికతతో ఈ రోజు యుద్ధం చేయాలి. కాలం చెల్లిన వ్యవస్థలతో కాదు.’’ అని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో మానవ రహిత వైమానిక వాహనాలు(యూఏవీ), కౌంటర్ మానవ రహిత వైమానిక వ్యవస్థ స్వదేశీకరణపై జరిగిన వర్కుషాపులో సీడీఎస్ మాట్లాడారు. దేశం తన వ్యూహాత్మక లక్ష్యాలకు కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంపై విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మే నెలలో చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రస్తావించారు. ఆ సమయంలో పాకిస్థాన్ మన సరిహద్దుల వెంబడి మానవ రహిత డ్రోన్లతో పాటు మందుగుండు సామాగ్రిని మోహరించిందని తెలిపారు. అయితే, పాక్ ప్రయోగించిన యూఏవీతో భారత సైన్యానికికానీ, పౌరుల మౌలిక సదుపాయాలకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.