Parliamentary Panel: సైబర్ నేరాల్లో సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదు
ABN , Publish Date - Aug 22 , 2025 | 07:04 AM
సైబర్ నేరాల్లో సీబీఐ దర్యాప్తునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరం లేకుండా, ‘ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టం, 1946’ను సవరించాలని...
కేంద్రానికి పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫారసు
న్యూఢిల్లీ, ఆగస్టు 21: సైబర్ నేరాల్లో సీబీఐ దర్యాప్తునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరం లేకుండా, ‘ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టం, 1946’ను సవరించాలని (ఈ చట్టం ప్రకారమే సీబీఐ ఏర్పాటైంది) హోంశాఖ వ్యవహారాలపై ఏర్పాటైన స్థాయీ సంఘం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది. సంబంధిత నివేదికను బుధవారం పార్లమెంటు ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విచారణలో భాగంగా తమకు సీబీఐ సమర్పించిన వాదనలను స్థాయీసంఘం తన నివేదికలో ఉటంకించింది. సైబర్ నేరాల్లో దర్యాప్తు ప్రారంభించినప్పుడు వెలుగులోకి వచ్చే ప్రాథమిక సాక్ష్యాధారాలపై లోతైన పరిశోధన జరపాల్సి వచ్చినప్పుడు.. రాష్ట్రాల అనుమతి తీసుకోవటం, వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు, చట్టాలు ఉండటం దర్యాప్తునకు తీవ్ర అవరోధంగా నిలుస్తున్నాయని సీబీఐ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో సీబీఐ దర్యాప్తునకు 8 రాష్ట్రాలు అనుమతి నిరాకరించాయని, అందుకు కారణాలేమిటో ఆయా రాష్ట్రాలను సంప్రదించి తెలుసుకోవాలని కేంద్రానికి స్థాయీసంఘం సూచించింది. ఓవైపు ఈ సూచన చేస్తూనే.. మరోవైపు, రాష్ట్రాల అనుమతి ప్రసక్తే లేకుండా సంబంధిత చట్టాన్ని సవరించాలని సిఫార్సు చేసింది.