Share News

Supreme Court: రోడ్డు ప్రమాద బాధితులకునగదు రహిత చికిత్సలు

ABN , Publish Date - May 14 , 2025 | 07:12 AM

సుప్రీంకోర్టు, రోడ్డు ప్రమాద బాధితులకు నగదు అవసరం లేకుండా చికిత్సలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకం కింద బాధితులు రూ.1.5 లక్షల వరకు సహాయం పొందవచ్చు.

 Supreme Court: రోడ్డు ప్రమాద బాధితులకునగదు రహిత చికిత్సలు

  • కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, మే 13: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు ప్రమేయం లేకుండా చికిత్సలు అందించే పథకాన్ని స్ఫూర్తితో అమలు చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకం కింద ప్రతి ప్రమాద బాధితుడు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు సహాయం పొందడానికి అవకాశం ఉంది. దీని అమలు తీరుపై ఆగస్టులోగా ప్రమాణ పత్రం సమర్పించాలని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం సూచించింది. ఈ పథకం కింద ఎంత మంది లబ్ధి పొందారో వివరించాలని తెలిపింది. ప్రమాద బాధితులకు నగదు తీసుకోకుండానే చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు జనవరి 8న ఆదేశించింది. ఆ ఆదేశాల అమలులో జాప్యం జరగడంతో ఏప్రిల్‌ 28న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 2022లో ఆమోదించిన మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 164ఏలో చికిత్సల ప్రస్తావన ఉన్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. దాంతో నగదు రహిత చికిత్సలపై నూతన విధానాన్ని రూపొందించినట్టు ఈ నెల అయిదో తేదీన కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. దీని అమలుపైనే సమాచారం ఇవ్వాలని ప్రస్తుతం ఆదేశించింది.

Updated Date - May 14 , 2025 | 07:12 AM