Share News

Madhya Pradesh: కార్బైడ్‌ గన్‌.. 14 మంది పిల్లల చూపు పోగొట్టింది

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:16 AM

దీపావళి, కొందరి పిల్లల కంటిచూపును శాశ్వతంగా పోగొట్టి వారి జీవితాల్లో చీకట్లు నింపింది. అత్యంత ప్రమాదకరమైన కార్బైడ్‌ గన్‌ను పేల్చడం ద్వారా మధ్యప్రదేశ్‌లో కేవలం మూడు రోజుల్లో 122 మంది చిన్నారులు తీవ్ర నేత్ర సంబంధిత ...

Madhya Pradesh: కార్బైడ్‌ గన్‌.. 14 మంది పిల్లల చూపు పోగొట్టింది

  • మధ్యప్రదేశ్‌లో కొన్ని కుటుంబాల్లో చీకట్లు నింపిన దీపావళి

  • ఈ తుపాకులపై కేంద్రం నిషేధం.. అయినా అడ్డగోలుగా విక్రయాలు

భోపాల్‌, అక్టోబరు 23: దీపావళి, కొందరి పిల్లల కంటిచూపును శాశ్వతంగా పోగొట్టి వారి జీవితాల్లో చీకట్లు నింపింది. అత్యంత ప్రమాదకరమైన కార్బైడ్‌ గన్‌ను పేల్చడం ద్వారా మధ్యప్రదేశ్‌లో కేవలం మూడు రోజుల్లో 122 మంది చిన్నారులు తీవ్ర నేత్ర సంబంధిత గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. వీరిలో 14 మంది చిన్నారులు శాశ్వతంగా చూపు పోగొట్టుకున్నారు. విదిశ జిల్లాలో ఎక్కువ మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. భోపాల్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌, గ్వాలియర్‌లోనూ ఎక్కువ కేసులు వెలుగుచూసినట్లు చెబుతున్నారు. కార్బైడ్‌ తుపాకులు అత్యంత ప్రమాదకరమైనవి కావడంతో వీటి అమ్మకాలపై అక్టోబరు 18న కేంద్రం నిషేధం విధించింది. అయినా.. వీటి విక్రయాలు భారీగా సాగాయి. కార్బైడ్‌ గన్‌ అనేది హ్యాండ్‌మేడ్‌ గన్‌. ప్లాస్టిక్‌ గొట్టాలతో తయారు చేస్తారు. దానికి చిన్న రంధ్రం చేసి.. అందులో కాల్షియం కార్బైడ్‌ లేదా గన్‌పౌడర్‌ కూర్చి పేల్చుతారు. ఇది పేల్చితే బాంబుల తరహాలో భారీగా శబ్దం వస్తుండం, అప్పటికప్పుడు పైపులతో సులభంగా తయారు చేసుకునే వీలు ఉండటం, బయట కూడా తక్కువ ధర (రూ.150- రూ.200)కే లభిస్తుండటంతో మఽధ్యప్రదేశ్‌లో పిల్లలు ఈసారి ఎగబడి కొన్నారు. ఈ తుపాకులను పేల్చినప్పుడు కొన్నిసార్లు నిప్పుకణికల్లాంటి రసాయన రేణువులు, మంటలు నేరుగా ముఖంపైకే దూసుకొస్తాయి. ఆస్పత్రిపాలైన పిల్లల్లో చాలామంది పాక్షికంగా చూపు కోల్పోయారు. ‘కార్బైడ్‌ గన్‌తో ఒక కన్ను పూర్తిగా కాలిపోయింది. ఆ కన్నుతో నేను ఇక చూడలేను’ అని నేహా అనే 17 ఏళ్ల బాలిక చెప్పింది. ‘సోషల్‌ మీడియాలో చూసి.. కార్బైడ్‌ గన్‌ను నేనే తయారు చేసి పండుగ రోజు పేల్చాను. ముఖమ్మీదే పేలడంతో ఒక కన్ను పూర్తిగా పోయింది’ అని రాజ్‌ విశ్వకర్మ అనే యువకుడు చెప్పాడు. కార్బైడ్‌ గన్‌ తయారీ, విక్రయాలకు సంబంధించి విదిశ జిల్లాలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కార్బైడ్‌ గన్‌ను బొమ్మ తుపాకీగా పరిగణించొద్దని, అది అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థం అని.. కంటి రెటీనాను పూర్తిగా దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Oct 24 , 2025 | 06:16 AM