MLA Mukul Roy for Party Defection: పార్టీ ఫిరాయించిన బెంగాల్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు
ABN , Publish Date - Nov 14 , 2025 | 03:52 AM
బీజేపీ టిక్కెట్‌పై గెలిచి తృణమూల్ కాంగ్రె్‌సలోకి మారిన సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గురువారం కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది...
గెలిచిన నెలకే బీజేపీ నుంచి టీఎంసీలోకి ముకుల్ రాయ్
కోల్‌కతా, నవంబరు 13: బీజేపీ టిక్కెట్‌పై గెలిచి తృణమూల్ కాంగ్రె్‌సలోకి మారిన సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గురువారం కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఫిరాయింపుల నిషేధం చట్టం కింద నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కారణంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణనగర్ (ఉత్తర) స్థానం ఖాళీ అయింది. అయితే ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు మాత్రం లేవు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండమే ఇందుకు కారణం. 2021 మే నెలలో బీజేపీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన కొద్ది సమయంలోనే అంటే.. జూన్ నెలలో తృణమూల్ కాంగ్రె్‌సలో చేరారు. ముకుల్‌పై అనర్హత వేటు వేయాలని బీజేపీకి చెందిన ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి స్పీకర్ బిమన్ బెనర్జీని కోరారు. అందుకు స్పీకర్ అంగీకరించలేదు. దాంతో సువేందు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం స్పీకర్‌కు మరో అవకాశం కల్పించింది. అయినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ముకుల్ రాయ్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. హైకోర్టు తనకు సంక్రమించిన రాజ్యాంగపర అధికారాలను ఉపయోగించుకొని ఫిరాయింపుల నిషేధం చట్టం కింద ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించడం ఇదే తొలిసారి అని సువేందు అధికారి తరఫు న్యాయవాది బిల్వదళ బెనర్జీ చెప్పారు. తీర్పుపై బీజేపీ నేత సువేందు అధికారి స్పందిస్తూ ఇది రాజ్యాంగ విజయమని అన్నారు.